రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే… ఇది ఓల్డ్..ప్రస్తుతం రాజకీయాలు మారిపోయాయి. ప్రత్యర్థులు అనే పదం పోయింది. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండరు, అందరూ శత్రువులే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ కోవకు చెందినదే ఈ రాజకీయ కథనం. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, అలియాస్ గణేష్.. మూడు రోజుల క్రితం ఒక ప్రమాదం బారిన పడ్డారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర లో జరుగుతున్న ఉద్యమం పై అవగాహన పెంచే కార్యక్రమంలో అన్ని మండలాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే గణేష్. ఒక మండలం పూర్తి చేసి.. రెండో రోజు ఇంకో మండలంలో తన అనుచరులతో బైక్ ర్యాలీ స్టార్ట్ చేశారు. స్వయంగా తానే ముందుండి ర్యాలీని లీడ్ చేస్తున్నారు.. గ్రామానికి, గ్రామానికి మధ్య గ్యాప్ ఉండడంతో ర్యాలీని కాస్త స్పీడప్ చేశారు..ఎమ్మెల్యే సహా అనుచరులు కూడా వేగంగా వెళ్తున్నారు.. ఇదే సమయంలో..వెనుక వస్తున్న బైక్ అదుపు తప్పి.. ఎమ్మెల్యే వాహనాన్ని ఢీ కొట్టింది.. దీంతో ఎమ్మెల్యే కింద పడిపోయారు.. కాలుకు దెబ్బ తగలడంతో లేవలేకపోయారు.. వెంటనే అనుచరులు ఆస్పత్రికి తీసుకెళ్లారు..అయినా కాలునొప్పి తగ్గలేదు..అక్కడి నుంచీ మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల తర్వాత కాలు ఫ్రాక్చర్ అయ్యిందని డాక్టర్లు తేల్చారు. ఆపరేషన్ కూడా చేశారు.
ఎమ్మెల్యే ప్రమాదంపై..ఆయన రాజకీయ గురువు, ప్రస్తుత రాజకీయ ప్రత్యర్ధి అయిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..నా కాళ్లు విరగ్గొడతానని మా ఎమ్మెల్యే అన్నాడు.. అన్న రెండ్రోజులకే ఆయన కాలు విరిగింది. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ఎవరి పరిస్థితైనా ఇంతేనని గట్టిగా విమర్శించారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రాజకీయాలను పక్కన పెట్టీ పరామర్శలు చేయకపోయినా సానుభూతి ప్రకటించడమో, అదీ ఇష్టం లేకపోతే కామ్‌గా ఉండటమో చేస్తారు.. కానీ నర్సీపట్నం రాజకీయం వేరు. వీళ్ల మధ్య అలాంటి శతృత్వం నెలకొని ఉంది.. మామూలుగానే అయ్యన్న వాడుక భాష అలానే ఉంటుంది. గతంలోనూ అనేక సందర్భాలలో అలా అనడం కూడా చూశాం. గతంలో ముఖ్యమంత్రి తో పాటు, రోజా, ఇతర మంత్రులపైనా అయ్యన్న చేసిన వ్యాఖ్యల పై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అయ్యన్నను ధీటుగా ఎదుర్కోవాలంటే అలాంటి భాషే వాడాలన్నది ఎమ్మేల్యే సూత్రం గా చెప్తారు. అంతమాటన్నాక ఎమ్మెల్యే ఊరుకుంటారా…
నా కాలు విరిగి హాస్పిటల్ లో ఉంటే అలా విరగాల్లే అంటావా శాడిస్టు..అని బూతులు అందుకున్నారు..ఇటీవలే మీ కొడుక్కి చేయి విరిగింది కదా..మరి దానికేం చెప్తావు అంటూ శాపనార్థాలు పెట్టారు. నేను మూడు నెలల్లో కోలుకుంటానులే కానీ.. నీకు మాత్రం దేవుడు తగిన శాస్తి చేస్తాడు చూడు అంటూ ఫైరయ్యారు.. వయసు కూడా అయిపొయింది కదా నీకు ఉండే పనిష్మెంట్ అలా ఇలా ఉండదు చూడు అంటూ..ఆస్పత్రిలో బెడ్‌పై నుంచే సెటైర్లు వేశారు. అంతేనా..అయ్యన్నను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. అది వైరల్ అవుతోంది..విశాఖ జిల్లా మాత్రమే కాదు..ఏపీ మొత్తం హల్‌చల్ చేస్తోంది. ఇద్దరి కామెంట్లపై ప్రజల్లో కూడా పెద్ద చర్చే జరుగుతోంది.. వీళ్లేం పొలిటికల్ లీడర్లురా నాయనా అని నిట్టూరుస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..