తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, జడ్పీ చైర్మన్ సరిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఇబ్బందులను ఓర్చి తెలంగాణ సాధించారన్నారు. తెచ్చుకున్న తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపారు. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటల పట్ల పట్టభద్రులు ఆలోచన చేయాలి. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రశ్నించాలి. టీఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవికి అలంపూరు ప్రజలు అండగా నిలవాలని మంత్రి వేమల అన్నారు.
ప్రతి ఒక్క కార్యకర్త 50 మంది ఓటర్ల బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 6280 మంది ఓటర్లను కలిసి మనకు అనుకూలంగా ఓటేయించాలి. బీజేపీ అభ్యర్థి ఇంతకుముందు గెలిసి చేసింది ఏం లేదు. ఇక ముందు చేసే అవకాశం కూడా లేదు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపిస్తేనే సమస్యల పరిష్కారం అవుతాయిన మంత్రి వేముల చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కలిగే ప్రయోజనాలను ఓటర్లకు వివరించాలి. తెలంగాణ లో ఉన్నట్లు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పథకాలు లేవని ఓటర్లకు వివరించాలని అన్నారు. పట్టభద్రులు ఆలోచన చేయాలి.. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వేమల విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో న్యాయవాదులకు రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాణిదేవి విద్వత్తు కలిగిన మహిళ, ప్రముఖ విద్యావేత్త. కలిసికట్టుగా వాణిదేవి గెలుపుకోసం కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓట్లేసి గెలిపించి ఆశీర్వదించండి .. ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలు తీర్చే బాధ్యత మాది అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
నూతన జిల్లాల ఏర్పాటుతో ఆయా పట్టణాలు నూతన ఆర్థిక కేంద్రాలుగా ఎదిగాయి. తెలంగాణకు కేంద్రం నిధులివ్వకపోవడమే కాదు .. కొత్త జిల్లాల ప్రకారం నూతన జోనల్స్ కు అనుమతించడం లేదు. కేంద్రం జోనల్ వ్యవస్థకు అనుమతిస్తే వెంటనే ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. గెలిపిస్తే వందరోజులలో తెలంగాణకు హైకోర్టు తెస్తానన్న బీజేపీ అభ్యర్థి గెలిచాక మొఖం చాటేశాడు .. ఇప్పుడు మాత్రం ఆయనేం చేస్తాడని మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ కు చేతకాదని తెలిసి రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేసి ప్రైవేటుపరం చేసింది. భవిష్యత్ లో ఈ సంస్థలలో రిజర్వేషన్లు లేక బడుగు, బలహీనవర్గాలు తీవ్రంగా నష్టపోతారు. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ? ఎంతమందికి ఉపాధి కల్పించింది ? దేశంలో తెలంగాణ ప్రభుత్వమే మీడియాకు, జర్నలిస్టులకు అండగా నిలిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. వాణిదేవిని గెలిపిస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేరుగా కలిసి వారు పరిష్కరించగలరు. నడిగడ్డ ప్రజలు మేలు చేసిన వారిని మరిచిపోరు. మీ సమస్యలు తీర్చిన టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవండని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మీ పాలమూరు కోడలినైన తనను ఆశీర్వదించాలని శాసనమండలి అభ్యర్థి వాణిదేవి అన్నారు. విద్యావేత్తగా ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. మీరందరూ ఆశీర్వదించి ఓట్లేసి శాసనమండలికి పంపించాలని వాణిదేవి కోరారు. మీ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది .. వాటి పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. బంజరు భూముల పాలమూరులో ప్రస్తుతం బంగారు పంటలు పండుతున్నాయి. 24 గంటల కరంటుతో రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని వాణిదేవి విజ్ఞప్తి చేశారు.
Read more:
ఈనెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేయనున్న ముఖ్యమంత్రి