Harish Rao – Pochamallu: ఉద్యమకారుడు పోచమల్లును పార్టీలోకి ఆహ్వానించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఈటల మీదకు ఘాటైన మాటలను సంధించారు. “ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు టీఆర్ఎస్ లోకి వచ్చాడు పోచమల్లు. దీంతో న్యాయం- ధర్మం రెండూ గెలిచాయి. ఈటల మాటలకూ చేతలకూ అస్సలు పొంతన కుదరడం లేదు. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పదన్న ఈటల ఈ రోజు మతతత్వ పార్టీలోకి చేరడంతోనే తెలుస్తోంది.. ఆయన ఎలాంటి వాడో” అని కామెంట్ చేశారు హరీశ్ రావు.
“తన మతం మానవత్వం అంటాడు – కానీ మతతత్వ పార్టీలో చేరుతాడు. తన అజెండా ఎర్రజెండా అంటాడు.. కానీ కాషాయ జెండా నీడలోకి వెళ్లాడు. ఇలా ఒకదానికొకటి పొంతన లేని రాజేందర్ తల కిందులు తపస్సు చేసినా సరే, గెలిచే అవకాశమే లేదు” అన్నారు హరీశ్ రావు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ 2001 నుంచి టీఆర్ఎస్ లో ఉన్నాడనీ.. ఉస్మానియాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నాటి నుంచి గెల్లు ఉద్యమ జెండా దించలేదనీ.. ఇలాంటి వారిని హుజూరాబాద్ లో గెలిపించుకోవడం మన బాధ్యతని ఈ సందర్భంగా హరీశ్ పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ గడ్డ – టీఆర్ఎస్ అడ్డా అనీ.. ఇక్కడ గెలిచేది గులాబీ పార్టీయేనని జోస్యం చెప్పారు ఆర్ధిక మంత్రి. ఇలా ఉంటే, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ టికెట్ దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తోంది. ఈ ముక్కోణ పోటీలో.. గెలుపెవరిదో అన్న ఉత్కంఠకు ఆస్కారమేర్పడుతోంది.
Read also: Political Temples: ఏపీలో కొత్త ట్రెండ్.. భారీ స్థూపాలతో పొలిటికల్ లీడర్లకు గుడి కట్టేస్తున్నారు