నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. రాజకీయ ఉద్దండులను ఢీకొని సాగర్ గడ్డపై స్వర్గీయ నోముల నర్సింహయ్య వారసుడు నోముల భగత్ గులాబీ జెండాను రెపరెపలాడించారు. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు ఉప ఎన్నికల ఫలితలు లెక్కించారు. నోముల భగత్ ప్రతి రౌండ్‌లోనూ మంచి ఆధిక్యం కనబరిచారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించగా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మళ్లీ మిగతా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శించింది. కారు వేగానికి హస్తం, కమలం పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి.
ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజకీయ ఉద్దండుడు జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతు అయింది. టీఆర్ఎస్ సర్కార్‌ను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంతగా విమర్శించినప్పటికీ.. వారి మాటలను సాగర్ ఓటర్లు నమ్మలేదు. బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. నోముల భగత్ గెలుపుతో టీఆర్‌ఎస్ ప్రచారం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసించినట్లైంది.
సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నోముల భగత్‌ను సాగర్ ఓటర్లు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారు. మూడు దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని.. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగర్‌లో చేసి చూపెట్టిందని టీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వమించారు. నియోజకవర్గంలోని చివరి ఎకరా వరకు నీరందించేందుకు పలు ఎత్తిపోతల ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి సాగర్ రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్న గులాబీ పార్టీని సాగర్ ప్రజలు ఆదరించారు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు త్వరితగతిన నెరవేరుస్తారా లేదా అనేది ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read More: