TELUGU STATES POLITICS HEATING UP TELUGUDESAM JANASENA BJP TIEUP: తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌లో ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఏపీ(Andhra Pradesh)లో ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలుండగానే పొత్తుల ఎత్తులపై కామెంట్లు, కథనాలు జోరందుకున్నాయి. రాజకీయ నాయకుల ప్రకటనలు, స్పందనలతో ఆసక్తికర వాతావరణం ఏర్పడుతోంది. తెలంగాణ(Telangana)లో ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువుండగానే పాదయాత్రలు, బహిరంగ సభలు, ఎన్నికల హామీలతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలతో రాజకీయ పార్టీల నేతలు బిజీబిజీగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సందడి చూస్తున్న వారికి ఎన్నికల షెడ్యూలు రేపో మాపో వస్తుందా అన్న భ్రమ కలుగుతోంది. మళ్ళీ సాధ్యాసాధ్యాలు ఆలోచించి.. అప్పుడే ఎన్నికలు లేకపోయినా పార్టీల్లో ఈ చురుకుదనం ఏంటబ్బా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే.. తెలంగాణలో ఈ పరిస్థితి నెల రోజుల క్రితమే ప్రారంభం కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మే 6వ తేదీన చంద్రబాబు ఎన్నికల పొత్తులపై చేసిన కామెంట్లతో మీడియా కథనాలు జోరందుకున్నాయి.
మే 6న చంద్రబాబు(Chandrababu) ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళారు. సందర్భం కాకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా వుండేందుకు పొత్తులకు రెడీ అన్నారు. పరోక్షంగా జనసేన(Janasena), బీజేపీ(Ap Bjp)లకు చంద్రబాబు సంకేతాలు పంపారు. అయితే బీజేపీ కంటే ముందే జనసేన స్పందించింది. కర్నూలు పర్యటనకు వెళ్ళిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడమే మంచిదన్నారు. మరి టీడీపీ(Tdp)తో కలుస్తారా అన్న ప్రశ్నకు సూటిగా స్పందించలేదు. ప్రస్తుతానికి బీజేపీతో స్నేహం కొనసాగుతోందన్నారు. నిజానికి 5 నెలల క్రితం కుప్పం పర్యటనకు వెళ్ళినపుడే చంద్రబాబు జనసేనతో పొత్తు పట్ల ఆసక్తి ప్రదర్శించారు. కానీ ప్రస్తుతం మాట్లాడినంత సూటిగా ఆనాడు బాబు మాట్లాడలేదు. జనసేన పట్ల తనది వన్ సైడ్ లవ్ అని మాత్రం చెప్పారు. ‘‘ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని మనకు ఉన్నా, వారికీ ఉండాలి కదా.. వన్ సైడ్ లవ్‌తో ఫలితం ఉండదు. రెండు వైపులా ప్రేమ ఉంటేనే ఫలిస్తుంది ’’ అని జనవరి 7న కుప్పం పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తుకు తామె రెడీ అయినా.. జనసేన కూడా తమతో పొత్తు పట్ల ఆసక్తి చూపాలని అనాడు చంద్రబాబు పరోక్షంగా చెప్పారు. ఏడు పదుల వయసులో రాజకీయ పొత్తులపై మాట్లాడేందుకు వన్ సైడ్ లవ్ టాపిక్‌ని ఎంచుకోవడం మరింత ఆసక్తి కలిగించింది. అయితే ఆ తర్వాత రెండు నెలలకు అంటే మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తీసుకుంటా. వైఎస్సార్‌సీపీ(Ysrcp)ని గద్దె దింపడానికి అందరినీ కలుపుకుని వెళ్తాం. ప్రభుత్వంపై పోరాటం చేయడానికి బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా.. ’’ అంటూ భవిష్యత్తులో పొలిటికల్ పొత్తులకు సిద్దమన్న సంకేతాల్నిచ్చారు. ఇక ఇటీవలి ఘటనలను, వ్యాఖ్యలను పరిశీలిస్తే.. మే 6న తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) పర్యటనకు వెళ్ళారు చంద్రబాబు. ‘‘ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలసి రావాలి.. ప్రజా ఉద్యమం రావాలి.. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది.. అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధం.. ’’ అని మరోసారి పొత్తుల దిశగా సానుకూలత వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అదే రోజు జనసేన స్పందించింది. ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) .. పొత్తుపై తమ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా స్పష్టతనిస్తారని ఆయననన్నారు. ఈ తరహా కామెంట్ల కారణంగా ఏపీలో పొలిటికల్ పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయంటూ కథనాలు ఊపందుకున్నాయి. అయితే చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని.. ప్రతీసారి ఎవరితో ఒకరితో కలిసి పోటీ చేయడమే బాబు నైజమని వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. వైసీపీని, ఆ పార్టీ అధినేతను సింహంతో పోల్చుకుంటూ ‘‘ సింహం సింగిల్‌గానే వస్తుంది ’’ అంటూ సినీ డైలాగులను ప్రస్తావించారు అధికార పార్టీ నేతలు. మరోవైపు చంద్రబాబు ఇచ్చిన సంకేతాలపై పవన్ కల్యాణ్ పాజిటివ్‌గానే స్పందించారు. ‘‘ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైఎస్సార్‌సీపీ మళ్లీ గెలుస్తుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసమే పొత్తులు. చంద్రబాబు నేరుగా పొత్తును ప్రతిపాదిస్తే అప్పుడు స్పష్టత ఇస్తా..’’ అని పవన్ కల్యాణ్ మే 8వ తేదీన కర్నూలు పర్యటనలో వ్యాఖ్యానించారు. అయితే పవన్ కల్యాణ్ మాటలపై జనసేనతో ఆల్ రెడీ కలిసి పయనిస్తున్న భారతీయ జనతా పార్టీ మాత్రం కాస్త జాగ్రత్తగానే స్పందించింది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ తమతోనే వున్నారని.. ఒకవేళ Pawan Kalyan తెలుగుదేశం పార్టీ వెంట వెళతానంటే అప్పుడు చర్చించుకోవచ్చని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) వ్యాఖ్యానించారు. అయితే.. ఇక్కడే ఆసక్తికరమైన అంశాలు తెరమీదికి వస్తున్నాయి. 2014లో బీజేపీతో పొత్తు.. జనసేనతో అవగాహనతో పోటీ చేసి, అధికారాన్ని పొందిన చంద్రబాబు కొన్నాళ్ళపాటు వాటితో కలిసే వున్నారు. ఆ తర్వాత రాజకీయ అవసరాలు మారడంతో చంద్రబాబు ఆ రెండు పార్టీలను పక్కన పెట్టేశారు.
తాజాగా 2024 ఎన్నికల దృష్ట్యా ఏపీలో మూడు పార్టీల కలయికకు రంగం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ ఆసక్తి రేపే అంశం ఏంటంటే.. చంద్రబాబుతో జతకట్టేందుకు బీజేపీ ఏ మేరకు సిద్దపడుతుందన్నది కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి దూరమైన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి… బీజేపీ నేతలను దుమ్మెత్తిపోశారు. ఆనాటి చంద్రబాబు విమర్శలు, ఆరోపణల్లో తీవ్రత కారణంగా చంద్రబాబుకు నరేంద్ర మోదీ, అమిత్ షా కనీసం అపాయింట్‌మెంటు కూడా ఇవ్వనంత కఠినంగా మారారు. 2019లో ఓటమి పాలైన విపక్షానికి పరమితమైన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీ నేతలను కలిసేందుకు ఎన్నో సార్లు యత్నించినా ఫలితం లేకపోయిందన్న కథనాలు మీడియాలో చాలానే వచ్చాయి. ఈ నేపథ్యంలో జనసేనతో టీడీపీ కలిస్తే.. బీజేపీ వైఖరి ఏంటన్నది ఆసక్తి రేపే అంశం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసినా వాటికి బీజేపీ దూరంగా వుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దన్న ఈ ఇద్దరు నేతల లక్ష్యం నెరవేరదు. అలాగని తమని విపరీతంగా తిట్టిపోసిన చంద్రబాబుతో కలిసేందుకు ఏపీ బీజేపీ నేతలు ఏ మేరకు రెడీ అవుతారన్నది కీలకం. అయితే పదేపదే నరేంద్ర మోదీ పట్ల, జాతీయయతాభావం పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసే పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తుకు బీజేపీ దూరంగా వుండే ఏం చేస్తారనేది కూడా ఇంటరెస్టింగే. ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయికపై అధికార వైసీపీ కాస్త గట్టిగానే స్పందించింది. రాజకీయాలంటే సినిమా కాదని ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు సీఎం సీటుపై కన్నేశారని.. మరి ఆ కూటమి గెలిస్తే ఇద్దరు సీఎంలు వుంటారా అని ప్రశ్నించారు సజ్జల. పొత్తుల పేరిట ఏపీ ప్రజలను మరోసారి దగా చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, ఆయన ఉచ్చులో పవన్ కల్యాణ్ పడుతున్నారని ఆయన కామెంట్ చేశారు.
ఇక తెలంగాణలో పాదయాత్రలు, బహిరంగ సభలు జోరందుకుంటున్నాయి. భారీ జనసమీకరణతో తమ సత్తా చాటేందుకు ప్రధాన విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు యత్నిస్తున్నాయి. సెంటిమెంటులో భాగంగా వచ్చే ఎన్నికల సమర శంఖారావాన్ని ఓరుగల్లు నుంచి వినిపించాలని తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఆ సభకు అధినేత రాహుల్ గాంధీని రప్పించడంలో సఫలీకృతం అయ్యారు. ఆయన్ని రప్పించడంతోపాటు వచ్చే ఎన్నికల హామీలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ని కూడా ప్రకటించారు. 2 లక్షల రూపాయలకు వరకు రైతు రుణ మాఫీ, ఎకరానికి 15 వేల రూపాయల డైరెక్టు సాయం, రీజనబుల్‌గా కనీస మద్దతు ధర (Minimum Support Price) లపై హామీలు గుప్పించారు. డిక్లరేషన్ అంటే కేవలం ప్రకటన కాదని.. అతి గ్యారెంటీ పత్రమని రాహుల్ గాంధీతో చెప్పించారు. వరంగల్ సభ రోజున రాహుల్, రేవంత్ రెడ్డిలు చేసిన కామెంట్లపైనా, విమర్శలపైనా, ఆరోపణలపైనా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.టీ.రామారావు అదే వరంగల్ వేదికగా మర్నాడు స్పందించారు. ఆరోపణలను తిప్పి కొట్టారు. మరోవైపు గత నెలలో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. జాతీయ స్థాయి నాయకులను రప్పిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తూ రక్తి కట్టిస్తున్నారు. మే 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి.. పాలమూరు జిల్లా భూత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి వెళ్ళారు. తెలంగాణలో రజాకార్ల పాలన కొనసాగుతుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారాయన. మే 14వ తేదీన బండి సంజయ్ పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ముగియబోతోంది. ముగింపు రోజున మహేశ్వరం సమీపంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ వద్ద భారీ బహిరంగ సభకు బీజేపీ నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. నిజానికి రాహుల్ వరంగల్ సభ కంటే ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తుక్కుగూడ బీజేపీ సభ 10, 15 వేల మందితో నిర్వహించాలని తెలంగాణ నేతలు అనుకున్నారు. కానీ రాహుల్ సభకు భారీగా జనసమీకరణ జరగడంతో దానికి ధీటుగా తమ తుక్కుగూడ సభ వుండేలా తాజాగా వ్యూహరచ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి ప్రతీ నియోజకవర్గం నుంచి 5 నుంచి 10 వేల మందిని సమీకరించాలని, ఉత్తర తెలంగాణ నుంచి నియోజకవర్గానికి వేయి, రెండు వేల మందిని రప్పించేలా బండి సంజయ్ పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు. పోటాపోటీ సభలు, యాత్రలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది.