Telangana Congress: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 200 మందితో ఇందిరాపార్క్ దగ్గర సమావేశం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు ప్రదర్శనగా వచ్చి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇందిరాపార్కు తోపాటు రాజ్‌భవన్‌కు వచ్చే మార్గంలో పలు చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.
అయితే, నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిబంధనలు అతిక్రమించి నిర్వహించే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు పోలీసులు సర్వ సన్నద్ధమయ్యారు. మరోవైపు, చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లనే ముట్టడిస్తామని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ ఎట్టిపరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని టీపీసీసీ చీఫ్ తేల్చి చెప్పారు.
ఈ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిన రేవంత్.. అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం అందజేయనున్నామని, ఇవాళ చేయబోయే ధర్నా పార్లమెంట్‌ను కూడా తాకనుందని రేవంత్ అన్నారు. ధరలపై పార్లమెంట్‌ను కూడా స్తంభింపజేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై మూడు రోజుల క్రితమే టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ వ్యాప్తంగా పోరుబాట పట్టి సైకిల్ ర్యాలీలు, ఎడ్లబండ్ల ర్యాలీలు తీసిన సంగతి తెలిసిందే.
పనిలోపనిగా.. రేవంత్ రెడ్డి పెట్రో ధరల పెంపు మీద ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లపై విమర్శలు ఎక్కుపెట్టారు. వీరిద్దరూ కలిసి 35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ అసలు ధర 40 నలబై రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయలు, కేంద్రం 33 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు తగ్గించే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
Read also: Drunken Driving: ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ.. మేడ్చల్‌లో మందుబాబు అరాచకం