బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు రాష్ట్ర పద్దుపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్‌లో వివిధ శాఖలకు సంబంధింన కేటాయింపులపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఉద్యోగుల చూపంతా అసెంబ్లీ వైపే నెలకొంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే అంశం హటా టాపిక్‌గా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీకి అడ్డంకి తొలగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పీఆర్సీ ప్రకటనకు ఈసీ నుంచి ప్రభుత్వం అనుమతి కోరింది. ఈ మేరకు ఈ నెల 20న రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇందుకు ఈసీ వెంటనే స్పందించింది. పీఆర్సీ ప్రకటించడంపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలుపుతూ సీఈసీ కార్యదర్శి అవినాశ్‌కుమార్ ఆదివారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి లేఖ రాశారు. అయితే ఉప ఎన్నికపై ప్రభావం పడకుండా దీనిని అమలు చేయాలని, ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేసేందుకు మార్గం సుగమమైంది.
ఇక ఈరోజు శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా పీఆర్సీపై ప్రకటించవచ్చని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘రెండు మూడు రోజుల్లో గౌరవప్రదంగా ఉండే పీఆర్సీని శాసనసభలో నేనే స్వయంగా ప్రకటిస్తా’’ అని అన్న విషయం తెలిసిందే. కాగా, ఫిట్‌మెంట్‌ను ఎంత శాతం ప్రకటిస్తారనే విషయంలోనూ ఆసక్తి నెలకొంది. సుమారు 29 శాతం ప్రకటిస్తారని ప్రచారంలో ఉంది.
ఫిట్‌మెంట్‌తోపాటు, ఉద్యోగుల హెల్త్‌కార్డు, పదవీ విరమణ వయసు పెంపు, సీపీఎస్ పెన్షన్ వంటి అంశాల్లో కూడా సీఎం స్పష్టత ఇచే అవకాశం ఉంది. కాగా, ఆదివారం రాత్రి ఉద్యోగ సంఘాల నేతలు మమత, రాజేందర్, సత్యనారాయణ, ప్రతాప్ తదితరులు సీఎం కేసీఆర్‌ను కలుసుకుని ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది. మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారికి సీఎం కేసీఆర్ ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.
Read More:
MLC Elections Results: పటాకులు కాల్చి.. మిఠాయిలు పంచి.. టీఆర్‌ఎస్ గెలుపుపై శ్రేణుల సంబరాలు