రాష్ట్రంలో 119 సీట్లు. ఆల్‌మోస్ట్ అన్ని చోట్లా పోటీకి దిగితే.. మొన్నటి ఎన్నికల్లో 103 సీట్లలో డిపాజిట్ గల్లంతు. కానీ తెలంగాణ గడ్డపై జెండా ఎగుర వేయాలి. కమలం సత్తా చాటాలి. ఇందు కోసం ఏం చేయాలి? అని మథనం చేస్తే… బిజెపి నేతలకు ఓ రూట్ దొరికిందట. కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్లు….అసలు సీటుపైనే కమలం గురిపెట్టిందట. అక్కడ నుంచి గేమ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ కమలం అసలు టార్గెట్ ఏంటి?
తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. అయితే ఈ గడ్డ ఇప్పుడు గులాబీ అడ్డా అయింది. గజ్వేల్‌లో తిరుగులేని మెజార్టీతో కేసీఆర్ రెండు సార్లు గెలిచారు. గజ్వేల్‌ను అన్ని రకాలు అభివృద్ధి చేస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి…..ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ బాధ్యతలను నర్సారెడ్డి చూస్తున్నారు. ఆయనకు ఇప్పుడు వల వేయాలనే ప్లాన్‌లో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
నర్సారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. 2009లో గజ్వేల్ నుంచి గెలిచారు. టీఆర్‌ఎస్‌లో చేరి కీలక నేతగా నియోజకవర్గంలో పనిచేశారు. అయితే 2018 ఎన్నికల ముందు పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని….గులాబీకి గుడ్ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.
గజ్వేల్‌లో గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. మహిళా నేత ఆకుల విజయ అభ్యర్థిగా నిలిచారు. కానీ చెప్పుకోదగ్గ ఓట్లు సంపాదించలేదు. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ సీఎం నియోజకవర్గంపై కన్నేసిందట. ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం చాలా రోజులుగా వెతుకుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు నర్సారెడ్డికి గాలం వేయాలనేది కమలనాథుల ప్లాన్. ఆయన్ని పార్టీలోకి లాగాలని చర్చలు జరుపుతున్నారట. అయితే డిసెంబర్‌లో కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత ఈయన చేరిక ఫైనల్ అవుతుందని నాంపల్లి బీజేపీ ఆఫీసులో గుసగుస విన్పిస్తోంది.