టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి చేసిన దాడిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. కర్రలు రాళ్లతో జరిపిన దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు వివరించామని ఆయన మీడియాకు తెలిపారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబు నివాసంపై దాడి జరిగినా సరే కేసులు పెట్టలేదని ఫిర్యాదులో పేర్కొన్నమన్నారు. పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని ఆవేద వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడడానికి వచ్చారని పోలీసులు సర్టిఫికెట్లు ఇస్తున్నారని మండి పడ్డారు. టీడీపీ కార్యకర్తలు నేతలే దాడికి పాల్పడినట్లు పోలీసులు అంటున్నారని.. పూర్తి పక్షపాత వైఖరితో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని తమ ఫిర్యాలు తెలిపామన్నారు.
దాడి చేసినవారిపై కేసులు పెట్టకుండా.. బాధితులపై కేసులు పెడుతున్నారు. ఏపీ పోలీసుల ఉదాసీన వైఖరి కారణంగానే ఈ ఘటన జరిగిందని హోంశాఖ కార్యదర్శికి వివరించామన్నారు. ఫిర్యాదుతోపాటు ఆ రోజు ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా హోంశాఖ కార్యదర్శికి అందజేశామన్నారు. దాడి చేసినవారిపై వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు పార్టీ అండమాన్ నికోబార్ శాఖ ఫిర్యాదు చేసింది. అండమాన్ రాష్ట్ర టీడీపీ శాఖ అధ్యక్షుడు ఎన్. మాణిక్య యాదవ్ ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపైకి ఎమ్మెల్యే జోగి రమేశ్ తన అనుచరులతో వచ్చి కర్రలు, రాళ్లతో దాడి చేశారని… ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తోందని.. పోలీసులు ప్రేక్షకుల మాదిరిగా చూస్తూ ఊరుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ నేతలపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పీఎం, అమిత్ షాలను కోరారు.
ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..
PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..