శాసనమండలిలో పెరిగిన వైసీపీ బలం.. ఆరుగురు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం

|

Mar 05, 2021 | 1:21 PM

వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అసెంబ్లీలో తిరుగులేని శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. మండలిలో మాత్రం టీడీపీది పైచేయిగా..

శాసనమండలిలో పెరిగిన వైసీపీ బలం.. ఆరుగురు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం
Follow us on

వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అసెంబ్లీలో తిరుగులేని శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. మండలిలో మాత్రం టీడీపీది పైచేయిగా ఉంది. పలు బిల్లులు అసెంబ్లీని దాటుకుని వెళ్లినా మండలిలో మాత్రం అడ్డుకట్ట పడుతూ వస్తుంది. ఏ నేపథ్యంలో మండలిలోనూ తన బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ అడుగులేస్తుంది. తాజాగా జరిగిన మండలి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది.

మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించగా, కేవలం ఆరుగురి నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. వారంతా వైసీపీకి చెందిన వారే కావడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా, వైసీపీ తరఫున మహమ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌, సి.రామచంద్రయ్యలను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్, గురువారం నాడు వారికి బీ ఫారమ్ లను అందించిన సంగతి తెలిసిందే.

తాసాగా ఈ ఆరుగురి ఎన్నికతో వైసీపీ బలం మండలిలో 18కి చేరుకుంది. ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 26గా ఉండగా, ప్రోగ్రసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు ఐదుగురు, బీజేపీ మూడు, ఇండిపెండెంట్లు ముగ్గురు వున్నారు. మరో మూడు ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి వుంది. వీటిని కూడా తమ సొంత చేసుకోవాలని వైసీపీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది.

వచ్చే మే నాటికి ఏపీ శాసనమండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం పడబోతుఉందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సీఎం వైయస్‌ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉండటం వల్లే అసంతృప్తులు లేవని చెప్పారు. మండలిలో మందబలంతో ఇంతకాలం టీడీపీ వ్యవహారించిన తీరును ప్రజలు గమనించారని చెప్పారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వటం, పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి సమపాళ్లలో సముచిత స్థానాలు ఇవ్వటం వల్లనే ఎక్కడా చిన్నపాటి సమస్య కూడా ఉండటం లేదన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని పార్టీలో అందరూ గుర్తించారు. అందుకే.. మిగిలిన పార్టీల్లో మాదిరిగా.. రాజకీయ సంస్కృతిలో భాగంగా ఉండే ఊహాగానాలు, అసంతృప్తులు వంటివి వైయస్‌ఆర్‌సీపీలో కనిపించవని అన్నారు. ఇది జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలబడుతుందని సజ్జల తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్‌లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని ప్రజలంతా గమనించారని సజ్జల చెప్పారు. వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారన్నారు. వచ్చే మేతో వైయస్‌ఆర్‌సీపీకి కౌన్సిల్‌లో మెజార్టీ వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ చేసే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇవ్వటంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఊపు అందుకుంటాయన్నారు సజ్జల. సమీప భవిష్యత్‌లో అదీ పూర్తి అవుతుంది. ఎంపికైన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి అభినందనలు తెలిపారు.

Read More:

షర్మిల కొత్త పార్టీపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారంటే..

ఆ జిల్లాలో సీన్‌ రివర్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో తలకిందులవుతున్న పార్టీల బలాబలాలు