ముఖ్యమంత్రిగారు..! మీతో నేను పనిచేయలేను.. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్.. క్రీడాశాఖా మంత్రి ట్వీట్..

|

May 27, 2022 | 4:00 PM

Rajasthan: మొన్న ఎమ్మెల్యే రాజీనామా, నేడు మంత్రి ట్వీట్‌ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇంటి గుట్టుని రచ్చకీడుస్తోంది. తనకి విముక్తి కల్పించడమే కాదు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తోన్న కుల్‌దీప్‌ రంకాకి తనకిచ్చిన మంత్రిత్వ శాఖలన్నీ..

ముఖ్యమంత్రిగారు..! మీతో నేను పనిచేయలేను.. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్.. క్రీడాశాఖా మంత్రి ట్వీట్..
Rajasthan
Follow us on

రాజస్థాన్‌ సీఎంకి(Rajasthan CM) షాకిచ్చారు ఆ రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి అశోక్‌ చాంద్నా(Rajasthan sports minister Ashok Chandna). ఈ క్రూరమైన మంత్రి పదవి నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ట్విట్టర్‌ వేదికగా ముఖ్యమంత్రిని కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. అసలే పతనావస్థలో ఉన్న కాంగ్రెస్‌కి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మొన్న ఎమ్మెల్యే రాజీనామా, నేడు మంత్రి ట్వీట్‌ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇంటి గుట్టుని రచ్చకీడుస్తోంది. తనకి విముక్తి కల్పించడమే కాదు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తోన్న కుల్‌దీప్‌ రంకాకి తనకిచ్చిన మంత్రిత్వ శాఖలన్నీ కట్టబెట్టాలంటూ ముఖ్యమంత్రిని కోరుతూ క్రీడాశాఖా మంత్రి అశోక్‌ చాంద్నా ట్వీట్‌ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ కార్యదర్శి పై అసంతృప్తిని ప్రతిబింబించే అశోక్‌ చాంద్నా ట్వీట్‌తో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఇంటిపోరు మరోమారు తెరపైకి వచ్చింది.

వారం క్రితమే భూపంపిణీకి సంబంధించిన విషయంలో రాష్ట్రప్రభుత్వాధికారులకీ, ఎమ్మెల్యేగణేష్‌ ఘోగ్రాకి మధ్య విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయడంతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. తాజాగా మంత్రిగారే అధికారులతో విసిగిపోయిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యేగణేష్‌ ఘోగ్రా విషయంలోనూ, ఇటు మంత్రి అశోక్‌ చాంద్నా విషయంలోనూ అసంతృప్తికి కారణం అధికారులే కావడంతో అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోందన్న ప్రశ్న రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రాజస్థాన్లో రాజ్యసభ ఎన్నికలుండడంతో మంత్రి ట్వీట్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అదనుగా భావించిన ఆ రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్‌ పై విమర్శలు గుప్పిస్తోంది. “ఈ నౌక మునిగిపోతోంది. 2023 ఎన్నికల ట్రెండ్స్‌ కనిపిస్తున్నాయి” అంటూ సీఎం గహ్లాట్‌ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పునియా ఎద్దేవా చేశారు.