Rahul Gandhi: జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వచ్చే వారం అక్కడ పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన అఖిలపక్ష నేతల సమావేశంలో ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరగడం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కల్పించిన వెంటనే అక్కడ ఎన్నికలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ నెల 9న జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ పార్టీ శ్రేణులతో రాహుల్ సమావేశంకానున్నారు.
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా అక్కడ పర్యటనకు వెళ్తనున్నారు. కొన్ని రోజుల పాటు అక్కడ రాహుల్ గాంధీ మకాం వేయనున్నట్లు సమాచారం. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా అక్కడ రాహుల్ పర్యటన సాగనుంది.
జమ్ముకశ్మీర్ పర్యటనపై పార్టీ సీనియర్ నేతలతోనూ రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన విపక్ష నేతల సమావేశంలోనూ త్వరలోనే తాను జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారని మీడియా వర్గాలు తెలిపాయి.
Also Read..