కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో తమ కొడుకులకు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబట్టి పార్టీ ఓటమికి కారకులయ్యారని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఇందుకు ఉదాహరణగా అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ తదితరుల గురించి ఆయన ప్రస్తావించారు. వారి అభ్యర్థనను తాను తిరస్కరించినప్పటికీ వారు ఏదో ఒకలా తమ వారసులను నిలబెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాజీనామా చేసేందుకు సిధ్ధపడిన రాహుల్ ని సీనియర్ నేతలు వారించి.. ఆయన సూచనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా-స్థానిక నాయకుల జోక్యాన్ని మొదట ‘ ప్రక్షాళన ‘ చేయాలంటూ జ్యోతిరాదిత్య సింధియా చేసిన వ్యాఖ్యపై స్పందించిన రాహుల్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు రాబట్టినప్పటికీ ఈ ఎలక్షన్స్ లోకుదేలైన కారణం బహుశా ఇదే అయి ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నారు. ఈ సందర్భంలో మాజీ కేంద్ర మంత్రి పి .చిదంబరం పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఒడిశా పీసీసీ చీఫ్ కూడా తన కుమారునికి టికెట్ దక్కేలా ప్రయత్నించిన విషయం గమనార్హం. కానీ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. రఫెల్ వ్యవహారంలో ‘ చౌకీదార్ చోర్ హై ‘ అంటూ తానిచ్చిన నినాదాన్ని నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భద్రత అంశంలో మోదీ గానీ, బీజేపీ నాయకులు గానీ చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు దీటుగా ఎదుర్కోలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే ఈ నినాదం పార్టీకి మేలు కన్నా చేటునే తెచ్చ్చిపెట్టింది. అటు-ఓటమికి గల కారణాలను కూలంకషంగా విశ్లేషించుకుని భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి సమైక్యంగా అంతా కృషి చేయాలని, రాహుల్ కే ఈ బాధ్యత అప్పగించాలని నేతలు తీర్మానించారు. ఇదిలా ఉండగా -ఎన్నికలకు ముందు పార్టీ స్క్రీనింగ్ కమిటీ అని, స్టార్ క్యాంపెయినర్స్ కమిటీ అని వివిధ రకాల కమిటీలను వేసి అభ్యర్థుల గుణగణాలు, వారి వారసుల గెలుపుఓటములపై సుదీర్ఘ అంచనాలు వేసి.. మొత్తం ఎంపిక బాధ్యతనంతా సీనియర్ నాయకులు రాహుల్ పైనే ‘ నెట్టిన ‘ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. పైగా ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. సంపర్క్ ఫర్ సమర్ధన్ పేరిట దేశ వ్యాప్తంగా పర్యటించి సాధారణ ప్రజలతో బాటు సెలబ్రిటీలు, క్రీడాకారుల ఇళ్లకు కూడా స్వయంగా వెళ్లి పార్టీకి వారి మద్దతును కోరిన సంగతి విదితమే. బాలీవుడ్ దిగ్గజాలంతా మేము మీ వెంటే అంటూ నాడే కాషాయ పార్టీకి తమ సపోర్ట్ ప్రకటించారు. పైగా ఢిల్లీ లో ట్విటర్, ఫేస్ బుక్ తో బాటు వాట్సాప్ ద్వారా బీజేపీ తమ శ్రేణులకు, సామాన్య జనానికి ఇఛ్చిన సందేశాలు, వీడియోలు ఆ పార్టీ ఘన విజయానికి దోహదపడ్డాయి.(కేవలం ఒక నెల రోజుల్లోనే ఇద్దరు బీజేపీ నేతలు వాట్సాప్ ద్వారా లక్షన్నర సందేశాలను పంపగలిగారని డిజిటల్ మార్కెట్ వ్యాపారి ఒకరు ఇటీవలే..అంటే ఫలితాల ప్రకటనకు ముందే వెల్లడించిన విషయం తెలిసిందే). ఇలా కమలనాథుల ముందస్తు ప్రచారం ముందు కాంగ్రెస్ క్యాంపెయిన్ వెలవెలబోయింది. బీజేపీలో కేవలం ఇద్దరే ఇద్దరు మోదీ , అమిత్ షా తమ కరిష్మాతో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీయడాన్ని దేశం ఆశ్చర్యంగా చూసింది.