ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్న తన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బయట పెట్టారు. ఢిల్లీలో ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పదవికి రాజీనామా చేసేందుకు సంసిధ్దత వ్యక్తం చేయగా.. సీనియర్ నేతలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాంతో పరిస్థితి కాస్త చల్లబడిందని అనుకునే లోగా.. మళ్ళీ రాహుల్ పాత పల్లవిని ఎత్తుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటానని తిరిగి ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు మళ్ళీ సమావేశమై రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్ఛు నన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, కె.సి.వేణుగోపాల్ తో ఈ నెల 27 న సమావేశమైన రాహుల్.. తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో పార్టీ అధ్యక్షపదవికి అర్హులైన అభ్యర్థి విషయమై చర్చించేందుకు మరో నాలుగు రోజుల్లో పార్టీ వర్కింగ్ కమిటీ మళ్ళీ సమావేశం కావచ్చునని తెలుస్తోంది. అయితే కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేంతవరకు తాను పదవిలో కొనసాగుతానని రాహుల్..అహ్మద్ పటేల్, వేణుగోపాల్ లకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. నెహ్రు-గాంధీ కుటుంబం నుంచే పార్టీ అధ్యక్షుడు ఉండాలన్న నియమమేమీ లేదని రాహుల్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం తన కృషి కొనసాగిస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా-గత శనివారం నుంచి రాహుల్ పాల్గొనాల్సిన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఈయన నిర్ణయం సరైనదేనని పార్టీలో కొంతమంది నేతలు భావిస్తుండగా.. కొందరు మాత్రం నాయకత్వం మారితే బాగుంటుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు
చౌకీదార్ చోర్ హై అన్న నినాదాన్ని పార్టీ సీనియర్ నేతలు ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్లలేకపోయారని రాహుల్, ప్రియాంక గాంధీ
అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. సల్మాన్ ఖుర్షీద్ వంటి నేతలు రాహుల్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగాలని గట్టిగా సూచిస్తున్నారు. రాహుల్ రాజీనామా అన్నది సిల్లీ థింగ్ అని ఆయన కొట్టి[పారేశారు. మరోవైపు మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో సహా ఏఐసీసీ కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేయాలని, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాహుల్ గాంధీకి పూర్తి స్వేఛ్చనివ్వాలని అభిప్రాయపడ్డారు. పార్టీ ఓటమిని రాహుల్ తన వ్యక్తిగతమైనదిగా భావిస్తున్నారని, శశిథరూర్ వ్యాఖ్యానించారు. నెహ్రు-గాంధీ కుటుంబం పార్టీని సమర్థంగా నడిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.