
ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలో ప్రచారం చేస్తూ బిజీగా గడుపుతోన్న ప్రియాంక గాంధీ తన సొంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ప్రియాంక రోడ్ షోకు సిద్ధమైన నేపధ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. ‘‘ప్రియాంక తన సమయాన్ని వృధా చేసుకుంటోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఆమె ఎందుకు పర్యటించదు..? ఉత్తర్ ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీకి.., ఢిల్లీలో ఆప్‌కు వ్యతిరేకంగా ఆమె ర్యాలీలు చేస్తోంది. కానీ బీజేపీతో నేరుగా తమ పార్టీ పోటీ ఉన్న ప్రదేశాల్లో అన్నాచెల్లెళ్లిద్దరు ఎందుకు ప్రచారం చేయడం లేదు’’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కూడా కేజ్రీ విమర్శలు చేశారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తానని ఇచ్చిన హామీపై మోదీ ఎందుకు వెనక్కి తగ్గారని ఆయన ప్రశ్నించారు. మోదీకి, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న సంబంధం ఏంటని..? భారత్‌కు మరోసారి మోదీయే ప్రధాని కావాలని ఇమ్రాన్ ఎందుకు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా కేజ్రీ ప్రశ్నలు సంధించారు.