టిడిపికి మరో పంక్చర్..ఈసారి సాగరతీరంలోనా ?

| Edited By:

Nov 02, 2019 | 11:59 AM

గన్నవరంలో మొదలైన రాజకీయ ప్రకంపనలు.. విశాఖ తీరందాకా పాకుతున్నాయి. టిడిపికి ఒక తలనొప్పి తగ్గకముందే మరొకటి మొదలైందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో నెలరోజుల్లో విశాఖ పాలిటిక్స్‌లో కీలక మార్పులు చేర్పులుంటాయన్న చర్చ సాగర తీర నగరంలో గల్లీగల్లీలో జోరైంది. మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని కాస్తో..కూస్తో టిడిపి నిలబడింది అంటే అది విశాఖ నగరంలోనే. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమలో గణబాబు, ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు, దక్షిణంలో వాసుపల్లి గణేష్‌ కుమార్‌ […]

టిడిపికి మరో పంక్చర్..ఈసారి సాగరతీరంలోనా ?
Follow us on
గన్నవరంలో మొదలైన రాజకీయ ప్రకంపనలు.. విశాఖ తీరందాకా పాకుతున్నాయి. టిడిపికి ఒక తలనొప్పి తగ్గకముందే మరొకటి మొదలైందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో నెలరోజుల్లో విశాఖ పాలిటిక్స్‌లో కీలక మార్పులు చేర్పులుంటాయన్న చర్చ సాగర తీర నగరంలో గల్లీగల్లీలో జోరైంది.
మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని కాస్తో..కూస్తో టిడిపి నిలబడింది అంటే అది విశాఖ నగరంలోనే. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమలో గణబాబు, ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు, దక్షిణంలో వాసుపల్లి గణేష్‌ కుమార్‌ గెలుపొందారు. ఇందుకు సంతోషించే లోపే.. గన్నవరంలో పొలిటికల్ పంక్చర్ పడింది టిడిపికి.
ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఎంత బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు. నవంబర్ 3నే ముహూర్తంగా వంశీ కన్‌ఫర్మ్ చేసుకున్నట్లు గట్టి సమాచారం. ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే.. సాగర తీరంలో అలజడి మొదలైంది. విశాఖ టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌ అవుతారని వార్తలు విన్పిస్తున్నాయి. విశాఖ ఉత్తర యోజకవర్గం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయమని అతని అనుచరులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే వైసీపీకి వెళ్లాలా? లేదా బీజేపీకి వెళ్లాలా? అనే దానిపై గంటా కన్ఫ్యూజన్‌లో ఉన్నారని అంటున్నారు.
వైసీపీలోకి వెళితే రాజీనామా చేయాలి? అటు పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందో లేదో అనుమానం. దీంతో గంటా బీజేపీ నేతల టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ కీలక నేత రాంమాధవ్‌తో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే గంటా పార్టీ మారడం ఖాయం. ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది. కానీ గంటా కండువా మార్పిడి తప్పదని అంటున్నారు.
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ సైతం పక్క చూపులు చూస్తున్నారట. విశాఖ టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు రెహ్మాన్‌కు ఆయనకు అసలు పొసగడం లేదట. దీంతో ఆయన అర్బన్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావడం లేదట. దీంతో వాసుపల్లి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విశాఖ పశ్చిమ నియోజకర్గ ఎమ్మెల్యే గణబాబు టీడీపీలో ఉన్నారు. కానీ మునుపటి స్పీడ్‌లో లేరు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ చంద్రబాబుతో ఉన్న అనుబంధంతో పార్టీ వీడే పరిస్థితి లేదు. పార్టీలో ఇతర ఎమ్మెల్యేలు సైలెంట్‌ కావడంతో ఇప్పుడు సిటీలో వెలగపూడి లీడ్‌ తీసుకుంటున్నారు. గతం కంటే మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. మొత్తానికి విశాఖలో ఆ ఇద్దరూ పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరీ ఈ ప్రచారానికి వారు పుల్‌స్టాప్‌ పెడతారా? లేదా? అనేది చూడాలి.