MP Komatireddy: టీ.కాంగ్రెస్‌లో కొరకరాని కొయ్యలా మారుతున్న ఎంపీ కోమటిరెడ్డి.. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

|

Sep 06, 2021 | 1:36 PM

MP Komatireddy Venkat Reddy: టి.కాంగ్రెస్ పార్టీలో ఇంట‌ర్న‌ల్ కోల్డ్ వార్ తారా స్థాయికి చేరింది. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి ఇష్యూ  మరింత చిక్కుముడిలా మారుతోంది.

MP Komatireddy: టీ.కాంగ్రెస్‌లో కొరకరాని కొయ్యలా మారుతున్న ఎంపీ కోమటిరెడ్డి.. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయా?
MP Komatireddy Venkat Reddy (File Photo)
Follow us on

టి.కాంగ్రెస్ పార్టీలో ఇంట‌ర్న‌ల్ కోల్డ్ వార్ తారా స్థాయికి చేరుతోంది. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి ఇష్యూ  మరింత చిక్కుముడిలా మారుతోంది. కొంత కాలంగా కొత్త పీసీసీ క‌మిటీ వ‌ర్సెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్న‌ట్లు వ్య‌వ‌హారం న‌డుస్తోంది. పార్టీలో ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌ల‌తో హీటెక్కుతోంది. ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుండ‌టంతో ముఖ్య‌నేత‌లు రంగంలోకి దిగారు. పీసీసీ చీఫ్ పదవిని ఆశపడి భంగపడ్డ ఎంపీ కోమటిరెడ్డి..స్వపక్షంలో విపక్ష నేతలా మారడం రేవంత్ రెడ్డితో పాటు కొత్త పీసీసీ కమిటీని ఇబ్బందిపాలు చేస్తోంది.  పార్టీకి కొరకరాని కొయ్యలా మారుతున్న ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో స‌యోధ్య చేసుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త క‌మిటీ నియామ‌కం త‌ర్వాత‌.. కొందరు సీనియ‌ర్లు గుర్రుగా ఉంటున్నారు. పలువురు సీనియ‌ర్లు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌ట‌మే కాకుండా.. ఎలాంటి కామెంట్స్ చేయ‌కుండా సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా పార్టీ నిర్ణ‌యాల‌పై బాణాలు సంధిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సంస్మ‌ర‌ణ స‌భ విష‌యంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌యంపై కోమ‌టిరెడ్డి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. తాలిబ‌న్‌ల మాదిరిగా నియంత‌త్వ నిర్ణ‌యాలు మంచివి కావంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే సీత‌క్క రాఖి పౌర్ణ‌మి సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాఖి క‌ట్టి.. కాళ్లు మొక్క‌డాన్ని కూడా కోమ‌టిరెడ్డి త‌ప్పుప‌ట్టారు.

పార్టీ ఆదేశాలను లెక్కచేయకుండా విజయమ్మ నిర్వహించిన వైఎస్ ఆత్మీయ సమ్మేళనంకు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి  హాజరుకావడంపై ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కి గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కోవ‌ర్టు రాజ‌కీయాలు మానుకోవాలంటూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పార్టీలో ఉండాలంటే ఉండొచ్చు.. వెళ్లిపోవాల‌నుకుంటే వెళ్లవ‌చ్చంటూ కోమటిరెడ్డినుద్దేశించి కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా మ‌ధుయాష్కి కామెంట్స్ చేయ‌డంతో కాంగ్రెస్‌లో ఒక్క‌సారిగా హీట్ పెరిగింది. మ‌రోవైపు మిగ‌తా సీనియ‌ర్లు కోమ‌టిరెడ్డి విష‌యంలో కానీ.. మ‌ధుయాష్కి విష‌యంలో స్పందించేందుకు నిరాక‌రిస్తున్నారు.

పార్టీ సీనియ‌ర్లు ఒక‌రినొక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటుండ‌టంతో ప‌రిస్థితి చేయి దాటేలా ఉంద‌ని సీనియ‌ర్లు రంగంలోకి దిగారు. ఈ అంశానికి పుల్‌స్టాఫ్ పెట్టేందుకు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు. ఒక‌వైపు కోమ‌టిరెడ్డి చేసిన కామెంట్స్‌ను త‌ప్పుప‌ట్ట‌కుండా.. పీసీసీ రాలేద‌నే బాధ‌లో మాట్లాడి ఉండ‌వ‌చ్చ‌ని స‌మ‌ర్థించే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే మ‌ధుయాష్కి చేసిన కామెంట్స్‌ను కూడా అవి కోమటిరెడ్డిని ఉద్దేశించి కాదు.. పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలంటూ పరిస్థితిని చక్కదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో కాస్త గ్యాప్ ఉంటుంద‌ని.. దాన్ని త్వ‌ర‌లో స‌యోధ్య కుదురుతుంద‌ని చెప్పారు.

మొత్తం మీద కాంగ్రెస్ లో కొనసాగుతున్న కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుందా.. లేదా జ‌గ్గారెడ్డి, మరికొందరు నేతలు చేసే రాజీ ప్రయత్నాలతో స‌మ‌స్య‌కు పరిష్కారం లభిస్తుందా? అనేది వేచి చూడాలి.

అశోక్ భీమనపల్లి, టీవీ9 తెలుగు, హైదరాబాద్

Also Read..

Triangle Love Story: ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

MAA Elections: ప్రకాష్ ‘రాజ్ కీయం’… బండ్ల బ్లేడ్ ఎటాక్… మధ్యలో మెగా ట్విస్ట్…!