తెలంగాణలో తుది విడత మంత్రివర్గ విస్తరణకు ముందు, తరువాత హాట్ హాట్ పరిణామాలు జరిగాయి. మొదట సీనియర్ నేత, పార్టీ కోసం తీవ్రంగా పనిచేసిన వ్యక్తి ఈటెలను తొలగిస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. దీంతో ఎటువంటి తలనొప్పులకు పోకుండా కేసీఆర్..పాతవాళ్లను అలాగే ఉంచుతూ కొత్తగా కొందరికి మంత్రి పదవులు కల్పించారు. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ నాయకులు తమను కేసీఆర్ అన్యాయం చేశారంటూ కొందరు కార్యకర్తల దగ్గర వాపోగా..ఒకరిద్దరూ బాహటంగానే విమర్శలు దిగారు. వారిలో ముందున్నారు మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి.
ఉద్యమంలో పనిచేసిన తనకు మాటిచ్చి కేసీఆర్ అన్యాయం చేశారంటూ ఆయన మీడియాలో వ్యాఖ్యలు చేశారు. తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి అంటూ కూడా హామీ ఇచ్చారని నరసింహారెడ్డి వాపోయారు. అది కూడా జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి తను కూడా ఓనర్ నే అంటూ – కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు నాయిని. అయితే సంక్షేభాలను మొగ్గదశలోనే రూపమాపడంలో దిట్ట అయిన సీఎం కేసీఆర్ ఆయన దూకుడుకు విరుగుడు మంత్రాన్ని ఉపదేశించారు. ఆయన సీఎం స్వయంగా ఈ విషయాన్ని డీల్ చెయ్యకుండా..కేటీఆర్ ద్వారా నాయినికి నచ్చచెప్పారంట.
ఏం హామి దక్కిందో ఏంటో గానీ మాజీ హోం మంత్రి చల్లబడ్డారు. కేటీఆర్ తనతో మాట్లాడరని – తాను చిట్ చాట్ గా మాట్లాడితే.. మీడియా వాటిని హైలెట్ చేసిందని తాజాగా ఆయన చెప్పడం గమనార్హం. అంతేకాదు.. తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. సీఎం పిలిస్తే వెళ్తానని, ఆయనతో మాట్లాడతానని పేర్కొన్నారు.
మరోవైపు కేబినెట్ విస్తరణ భాగంగా మంత్రి పదవులు దక్కని నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. అసంతృప్తి నేతలకు స్వయంగా సీఎం కేసీఆరే ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో మంచి పదవులు ఇస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో అసమ్మతి గళం విప్పిన నేతలు ఒక్కక్కొరు నెమ్మదించినట్టుగా తెలుస్తోంది.
పదవి వస్తుందని గంపెడాశలు పెట్టుకొని భంగపడ్డ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ తాను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. భవిష్యత్తులో మాదిగలకు త్వరలోనే ఉన్నత పదవులు వస్తాయన్న నమ్మకం తనకు ఉందంటూ పేర్కొన్నారు. వీరితో పాటు జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, బాజిరెడ్డి గోవర్ధన్ లను కూడా అధిష్టానం బుజ్జగించినట్టు సమాచారం.