దూషణలపై వడ్డీతో సహా సమాధానం.. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్వీకి కేటీఆర్ మార్గనిర్దేశం

|

Mar 06, 2021 | 4:03 PM

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల వార్‌ తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఒకానొక సమయంలో రాజకీయ విమర్శలను దాటి పర్సనల్‌గా కూడా విమర్శించుకుంటుండటం హీట్‌..

దూషణలపై వడ్డీతో సహా సమాధానం.. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని  టీఆర్‌ఎస్వీకి కేటీఆర్ మార్గనిర్దేశం
Follow us on

తెలంగాణలో గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారా స్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల వార్‌ తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఒకానొక సమయంలో రాజకీయ విమర్శలను దాటి పర్సనల్‌గా కూడా విమర్శించుకుంటుండటం హీట్‌ పెంచుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్వీ సదస్సులో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్‌పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించి స్వరాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు మీడియా, మనీ, మజిల్‌ పవర్‌ లేదని.. కొందరు నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణ సాధనలో విజయం సాధించారని పేర్కొన్నారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ది సీఎంలను ఉరికించిన చరిత్ర అని తమ మౌనాన్ని బలహీనంగా భావించొద్దన్నారు.

గోడకు వేలాడదీసే తుపాకీ సైతం మౌనంగానే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుందని ప్రతిపక్షాలకు చురకలంటించారు. కేసీఆర్‌ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో యావత్‌ తెలంగాణకు తెలుసన్నారు. ఏప్రిల్‌ 27 నాటికి టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 2 దశాబ్దాలని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో నిలిచిందని పేర్కొన్నారు. వాట్సప్‌ వర్సిటీలో బీజేపీ నాయకులు అబద్దాలు నేర్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. విద్యారంగానికి కేంద్రంలోని బీజేపీ చేసింది గుండు సున్నా. రాష్ట్రానికి రావాల్సిన సంస్థలను కూడా ఇవ్వట్లేదని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

తెలంగాణకు నవోదయ విద్యాలయాలు కూడా దక్కలేదు. కొత్త వైద్య కళాశాలల్లోనూ తెలంగాణకు మొండిచెయ్యి చూపారు. తెలంగాణ పట్ల వివక్ష చూపిన బీజేపీకి ఓటేందుకు వేయాలి. విశాఖలో ఉక్కు పరిశ్రమను మూసేస్తున్న వారు బయ్యారంలో పరిశ్రమ కడతర? ఒకడు ఎగిరెగిరి ఏమైపోయాడో తెలుసు. అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు తడాఖా చూపుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు ద్వారా బీజేపీకి సమాధానం చెప్పాలి అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు మంత్రి కేటీఆర్‌. ఆరేళ్ల పాలనలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ వస్తుందని ఆరోపించారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను విద్యార్థి విభాగం నేతలు తిప్పికొట్టాలని కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు.

Read More:

వార్డులు, బూత్‌ల వారీగా ఎర్రబెల్లి సమీక్ష.. ఓటర్లకు ఏమేమి చెప్పాలో దిశానిర్దేశం చేసిన మంత్రి