మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బిజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో TRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
ప్రధాన నరేంద్ర మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్, పెట్రోల్ , గ్యాస్ సిలిండర్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశ్యంతో ఈటల రాజేందర్ ప్రచార శైలి మార్చారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రధాని మోడీ ఫోటో, BJP జెండాలను దాచి కేవలం తన ఫోటోను, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఎద్దేవా చేశారు.
BJP పార్టీ తరపున గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమనే విషయం అందరికీ తెలుసన్నారు. BJP పార్టీపై విశ్వాసం ఉంటే ఇదే ఈటల రాజేందర్ వెళ్లి మోడీ దగ్గర వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలరా అంటూ ప్రశ్నించారు. ఈటల ఎత్తుగడలకు మోసపోయే పరిస్థితి హుజూరాబాద్‌లో లేదన్నారు.
ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటిందని, అక్కడ BJPకి ఓటు వేస్తే వచ్చే ఏడాదిలో డీజిల్, పెట్రోల్ ధరలు రూ.200 దాటడం ఖాయమని, గ్యాస్ సిలిండర్ ధర రూ.1500 దాటుతుందని అన్నారు. మోడీ అవలంభిస్తున్న విధానాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే బలహీనంగా మారిందన్నారు.
అందుకే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో BJP పార్టీని బండకేసి కొట్టారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. రేపు హుజూరాబాద్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అదే TRS పార్టీ అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనం కంటే వ్యవస్థ ప్రయోజనమే ముఖ్యమన్నారు.
ఇవి కూడా చదవండి: Shocking Video: ఈ అమ్మాయికి ఇదే బెస్ట్ ఫ్రెండ్.. ఆట.. పాట.. ఎక్కడైనా ఇది ఉండాల్సిందే.. చూస్తే షాక్ అవుతారు..
IND vs ENG 1st Test Day 2 Live: తొలి రోజు టీమిండియా పేస్ పంచ్.. ఇవాళ బ్యాటింగ్ బౌండరీలు చూద్దాం..