పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలిండియా మజ్లిస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల 25 న కోల్‌కతాకు వెళ్లి అక్కడ మైనారిటీలు అధికంగా ఉన్న ‘మెటియాబృజ్’ ప్రాంతంలో జరిగే ర్యాలీలో పాల్గొననున్నారు. గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల్లో 5 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ త్వరలో బెంగాల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు తహతహలాడుతోంది. ఈ రాష్ట్రంలో అబ్బాస్ సిద్దిఖీ అనే ముస్లిం నేత ఆధ్వర్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్.తో ఎంఐఎం పొత్తు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ ఆయనతో చర్చించనున్నారు. బెంగాల్ లో ఒవైసీ పాల్గొననున్న మొదటి ర్యాలీ ఇదే కానుందని, రాష్ట్రంలో తమ పార్టీ ప్రచారం ఇక ప్రారంభమవుతుందని ఎంఐఎం స్టేట్ సెక్రటరీ జమీరుల్ హసన్ తెలిపారు. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న మెటియాబృజ్ ప్రాంతం సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గం పరిధిలో ఉంది.
ఎంఐఎం అప్పుడే ‘ఆవాజ్ ఉఠానే కే వక్త్ ఆచుకా హై’ (మీ గళమెత్తే సమయం ఆసన్నమైంది) అనే నినాదాన్ని ఎత్తుకుంటోంది. అయితే ఈ పార్టీ బీజేపీకి రెండో తోక పార్టీ అని, ఈ రాష్ట్ర ఎన్నికల్లో ఇది పోటీ చేసినా ఫలితం ఉండదని తృణమూల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక్కడి ముస్లిములలో చాలామంది బెంగాలీ మాట్లాడేవారేనని, వారు ఒవైసీకి మద్దతునిచ్ఛే ప్రసక్తి లేదని ఈ పార్టీ నేత సౌగత్ రాయ్ పేర్కొన్నారు. అటు-అసదుద్దీన్ ఒవైసీ గత జనవరి 3 న కోల్ కతాకు వచ్చి ..అబ్బాస్ సిద్దిఖీతో భేటీ అయ్యారు. బెంగాల్ ఎన్నికల్లో ఉభయ పార్టీలు అనుసరించాల్సిన వ్యూహం, పొత్తు తదితర అంశాలపై ఆయనతో ప్రాథమిక చర్చలు జరిపారు.
Also Read:
YS Sharmila: వైఎస్ షర్మిలను కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమారుడు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్