ఒకే ఒక కుర్సీ. ఆ సీటు కోసం అర డజన్ మంది రేసులో ఉన్నారు. హైదరాబాద్ టు ఢిల్లీ పరుగులు పెడుతున్నారు. కానీ ఆ రేసులో విన్ అయ్యేది ఎవరో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆరుగురు మాత్రం పరుగు ఆపడం లేదు. కానీ సందట్లో సడేమియా లాగా ఓ ఇద్దరు మాత్రం రేసులో ఏం చేయాలో ప్లాన్ వేశారట. పాజిటివ్‌గా ముందుకు వెళ్లే ఎత్తుగడ వేశారట. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు?
తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు వస్తారా? అని పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వార్తలు విన్పిస్తున్నాయి. అరిగిపోయిన రికార్డులా ఈ వార్తలు చక్కర్లు కొడుతూనే వున్నాయి. కానీ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పుడు డిసెంబర్‌లో కొత్త పీసీసీ ప్రెసిడెంట్ వస్తారని ప్రచారం జరుగుతోంది.
అరడజన్‌కు పైగా నేతలు పీసీసీ సీటు కోసం పోటీ పడుతున్నారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్, సీనియర్ల కోటలో విహెచ్ తదితరులు పోటీపడుతున్నారు. రేసులో ఉన్న నేతల్లో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటారు. ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి కొత్త అభ్యర్ది పేరు తెరపైకి తీసుకొస్తే వెంకట్‌రెడ్డి నిప్పలు చెరిగారు. ఈ ఇద్దరి మధ్య యుద్దవాతావరణమే నడిచింది.
అయితే ఇలాంటి నేతలు ఇద్దరు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరిద్దరిని సన్నిహితులు కలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఇలా పొట్లాడుకోవడం తగదని….. కలిసి పనిచేస్తే ఫలితం ఉంటుందని సర్ధిచెప్పినట్లు సమాచారం. మొత్తం ఇద్దరి మధ్య స్నేహం చిగురించేటట్లు చేసిన అమెరికా పెద్దలు …మరో ఒప్పందం కూడా సెట్ చేశారట. పీసీసీ సీటు విషయంలో ఇద్దరు మధ్య ఒక ఒప్పందం కుదిర్చినట్లు తెలుస్తోంది.
అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్, కోమటిరెడ్డిల మధ్య రాజీ సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా వచ్చే రెండేళ్లు కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి, చివరి రెండేళ్లు రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇద్దరు దీనికి అంగీకరించినట్లు సమాచారం.
అమెరికా వేదికగా ఈ ఒప్పందం ఇద్దరి మధ్య కుదరినంత మాత్రాన టీపీసీసీ పదవి పప్పు బెల్లం కాదుగా పంచుకోవడానికి అని రేసులో ఉన్న ఇతర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పిసిసి పదవి వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరింది అదే చాలు అనుకుంటున్నాయట గాంధీభవన్ వర్గాలు.