సరిగ్గా పదేళ్ళ క్రితం రాజకీయ రంగ ప్రవేశం.. కట్ చేస్తే ఇవాళ పార్టీలో నెంబర్ టూ. ఎస్.. ఈ కామెంట్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించే. 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనా అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటూ చాలా కాలం వుండిపోయిన గులాబీ దళపతి కే.చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 2009 ఎన్నికలకు ముందు అత్యంత కీలక సమయంలో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజు నుంచే తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నారు.
2009, 2014, 2019 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి హ్యాట్రిక్ కొట్టిన కేటీఆర్.. 2014 నుంచి మంత్రిగానూ కొనసాగుతున్నారు. అయితే, గత డిసెంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడి, ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించారు. సరిగ్గా ఏడాది క్రితం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్.. ఏడాది కాలంలో పార్టీలో తానే నెంబర్ టూనన్న సందేశాన్ని గట్టిగానే పంపారు పార్టీ శ్రేణులకు, ఇతర రాజకీయ వర్గాలకు.
తన రెండో ప్రభుత్వంలో ముందుగా కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోయినా.. పార్టీ పగ్గాలను అప్పగించారు కేసీఆర్. దాంతో పూర్తి సమయం పార్టీకి కేటాయించే అవకాశం దక్కిందాయనకు. అదే క్రమంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోను కేటీఆర్ సానుకూల ఫలితాన్ని రాబట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ.. తనదైన శైలిలో పార్టీపై పట్టు సాధించుకున్నారు.
ఏడాది కాలంలో పార్టీలో తాను నెంబర్ టూనని చాటుకున్న కేటీఆర్.. త్వరలో అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నారు. జనవరి మూడోవారం నుంచి ఫిబ్రవరి రెండో వారం మధ్యలో మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఆ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రణాలిక సిద్దం చేసిన కేటీఆర్.. నిత్యం పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏడాది పూర్తి చేసుకున్న కేటీఆర్.. త్వరలో ఎదురవబోతున్న మునిసిపల్ పరీక్షలో నెగ్గితే.. మరో ప్రమోషన్ ఆయన మరింత దగ్గరైనట్లేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.