కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను కించపరిచేలా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సబబుకాదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శశి థరూర్ సీనియర్ పార్లమెంటేరియన్, మేధావిగా మంచి గుర్తింపు కలిగిన నాయకుడని అన్నారు. ఆయన వ్యక్తితత్వం రాజకీయాల్లో అందరికీ ఆదర్శవంతమని కొనియాడారు. అలాంటి వ్యక్తినుద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తనను బాధించాయన్నారు. శశి థరూర్‌పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
శశి థరూర్ నుంచి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఏమని స్పందిస్తారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌నుద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శశి థరూర్‌కు ఫోన్ చేసి తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తంచేసినట్లు వెల్లడించారు. అటు రేవంత్ రెడ్డి నుంచి తనకు ఫోన్ వచ్చినట్లు తెలిపిన శశి థరూర్.. రేవంత్ రెడ్డి క్షమాపణను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుట్ స్టాప్ పెడుతున్నట్లు వ్యాఖ్యానించారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేస్తామన్నారు.
ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ అధ్యక్ష పదవి తనకు దక్కకపోవడం పట్ల కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ సారథ్య పగ్గాలు అప్పగించడంపై తన అసంతృప్తిని బాహటంగానే వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను కోమటిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఖండించారు.
శశి థరూర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావంతూ కోమటిరెడ్డి చేసిన ట్వీట్..
Dr @ShashiTharoor is a renowned parliamentarian & highly regarded as public intellectual. His personality inspires everyone across the political spectrum.
As a senior congressmen I am deeply hurt by the unwarranted remarks made by @INCTelangana President against Tharoor sahib.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) September 17, 2021
Also Read..
అనుమానాలున్నాయి.. రేపిస్ట్ రాజు మరణంపై విచారణ జరిపించండి.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్
Tollywood Drugs Case: ఈడీ అధికారుల ముందుకు తనీష్.. కొనసాగుతున్న విచారణ..