కాంగ్రెస్‌ పార్టీకి ఇందిరా శోభన్‌ రాజీనామా.. షర్మిలతో భేటీ అయిన టీపీసీసీ అధికార ప్రతినిధి

|

Mar 03, 2021 | 1:01 PM

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు..

కాంగ్రెస్‌ పార్టీకి ఇందిరా శోభన్‌ రాజీనామా.. షర్మిలతో భేటీ అయిన టీపీసీసీ అధికార ప్రతినిధి
Follow us on

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో వైయస్‌ షర్మిల స్పీడ్‌ పెంచారు. వివిధ జిల్లాల వైయస్‌ అభిమానులతో భేటీ అవుతున్న షర్మిల కొత్త పార్టీ విధి విధానాలపై చర్చిస్తున్నారు. ఈ నెల 9న పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు షర్మిల టీం లీక్‌లిస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను ఆకర్షిస్తున్నారు షర్మిల. ఇప్పటికే వివిధ పార్టీల్లోని పలువురు నేతలు షర్మిలతో భేటీ అయి తమ మద్దతును ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 7ఏళ్ళుగా కాంగ్రెసులో నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

ఇందిరా శోభన్‌ రాజీనామా పూర్తి పాఠం:
పదవుల కోసం కాదు.. పార్టీ కోసం పనిచేస్తూ, ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నాపై పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరుపట్ల నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ అధికారంలో లేకున్నా.. ఆనాడు తెలంగాణ బిడ్డగా కాంగ్రెస్ కు అండగా ఉండాలని పార్టీలో చేరడం జరిగింది.

పార్టీలో చేరిన నాటి నుండి ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ బలోపేతం కోసం ఉన్న ప్రతీ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పనిచేయడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా పార్టీలోని సీనియర్ నాయకులు మరియు పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును చూసి ఒక మహిళా నాయకురాలిగా తీవ్ర ఆవేదన చెంది, పార్టీలో వారి వైఖరికి నిరసనగా నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా పార్టీకోసం నిరంతరాయంగా పనిచేస్తున్న యువనాయకత్వానికి మరియు వివిధ సామాజిక వర్గాలు మరియు ముఖ్యంగా మహిళలకు తగు ప్రాధాన్యత మరియు ప్రోత్సాహం ఇవ్వడంలో పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలం చెందింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచి, అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా, పార్టీ కోసం కష్టపడి పనిచేసి, ఎన్నికల్లో గెలిచే సమర్థత ఉన్న నాయకులకు టికెట్ ఇవ్వకుండా, తమకు నచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చి పార్టీకి తీవ్ర నష్టం కలిగించారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం రోజురోజుకూ రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ఠతను దిగజారుస్తూ కింది స్థాయి నాయకులు మరియు కార్యకర్తలకు భవిష్యత్ మీద ఆందోళన కలిగించేలా వ్యవహరిస్తూ, వారిని మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఓ విద్యావంతురాలిని మరియు మహిళ నాయకురాలిని అయిన నాకు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని, నాకు కాకున్నా ఎవరైనా నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని పార్టీని కోరినా మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని పార్టీకి యువతను దూరం చేసే ప్రయత్నం చేశారు.

ప్రజలకోసం, ప్రజా సమస్యల కోసం పార్టీ తరుపున వివిధ అంశాల మీద నేను ప్రతి నిత్యం పోరాటాలు చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా, పార్టీ పెద్దల నుండి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం తీవ్ర నిరాశకు కలుగజేసింది. కొంతమంది నాయకులు పార్టీ కార్యక్రమాలను, తమ సొంత కార్యక్రమాలుగా చేసుకుంటూ, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, పార్టీలో జరిగే కార్యక్రమాలకు ఇతర సామాజిక వర్గానికి చెందిన నాయకులకు, మరియు మహిళలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడగా వెళ్తుండటం నన్ను బాధించింది.

దేశ వ్యాప్తంగా వివిధ సమస్యల మీద ప్రజల తరపున పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నాయకులు తమ బాధ్యత మరిచి, ప్రజల కోసం పనిచేస్తున్న వారి నుండి సంజాయిషీలు కోరుతూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ అటు పార్టీకి, ఇటు కార్యకర్తలకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇతర నాయకులు మరియు కార్యకర్తలతో సమన్వయం చేసుకోకుండా వారి స్వార్థ రాజకీయాల కోసం వ్యవహరిస్తున్న తీరును చూసి భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. గత ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా కృతజ్ఞతలు.
– మీ ఇందిరా శోభన్

Read more:

మున్సిపల్‌ ఎన్నికల్లో పంచాయతీలకు మించిన ఫలితాలు ఖాయం.. ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్న ధర్మాన