Huzurabad By-Polls: అసహనంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఈటలపై మంత్రి హరీష్ రావు మండిపాటు

|

Aug 26, 2021 | 5:28 PM

Huzurabad By-Polls: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం అయినందునే అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందంటూ ధ్వజమెత్తారు.

Huzurabad By-Polls: అసహనంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఈటలపై మంత్రి హరీష్ రావు మండిపాటు
Telangana Minister Harish Rao
Follow us on

Huzurabad By-Polls: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం అయినందునే అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి.. టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపమన్నారు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్‌లోని వీణవంక‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో వైస్ ఎంపీపీ లత సహా పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

24 గంటల కరెంటు ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారని..అయితే ఇవాళ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని హరీష్ రావు అన్నారు. రైతులకు ఏ కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెడతామంటోందని ఆరోపించారు. రైళ్లు, రోడ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఈటెలకు రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగిలో ఎన్ని వడ్లు పండినా కొంటామని కేంద్రంతో ఒప్పించాలని అన్నారు. ఈటెల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టం తన కష్టంగా భావించే గొప్ప నేత సీఎం కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మీ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుదన్నారు.

ఆనాడు ప్రజల కోసం కేసీఆర్ రాజీనామా చేసారని..మరి ఈనాడు ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజలు బాగుపడలా.. ఈటెల బాగుపడలా ఆలోచించాలని అన్నారు. హుజురాబాద్‌కు బీజేపీ చేసిన మంచి పని ఏందో చెప్పాలని ప్రశ్నించారు. ముందుగా బీజేపీ హుజురాబాద్‌కు బీజేపీ కూడా వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగాలని అన్నారు. రైతులను బాగు చేసిన టీఆర్ఎస్‌కు ఓటేద్దామా.. రైతు నడ్డి విరిచిన బీజేపీకి ఓటేద్దామా ఆలోచించాలన్నారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కవన్న హరీష్ రావు.. పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్య జరుతోందన్నారు. ఎవరు గెలిస్తే లాభం జరుగుతుందో ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. ఈటెల గడియారాలు, కుట్టు మిషన్లు, కుంకుమ భరిణలను నమ్ముకుంటే.. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని నమ్ముకుందన్నారు.

ఏడేళ్లు మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి.. ఈటెల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఇక్కడ తీర్ధ యాత్రలు చేయడం కాదు.. ఢిల్లీకి యాత్ర చేయాలని హితవుపలికారు. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

Also Read..

మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

ఒక అమ్మాయి ఈ సంకేతాలు ఇస్తే అబ్బాయి స్నేహాన్ని, ప్రేమని ఇష్టపడుతుందని అర్ధమట