
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు, వైసీపీ మధ్య మాటల దాడి ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. మొన్నిటి వరకు విమర్శల్లో దూకుడు మీదున్న వైసీపీకి టీడీపీ నేతలు అదే రేంజ్‌లో సమాధానం ఇస్తున్నారు. పది రోజుల రోజుల క్రితం ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు జారీ చేసిన హెచ్చరికలు గట్టిగానే పనిచేస్తున్నాయి. ప్రభుత్వంపై చేసే విమర్శలకు దీటుగా జవాబు ఇవ్వాలనే వార్నింగ్‌తో మంత్రులంతా అలెర్ట్ అయ్యారు. వైసీపీ నేతల కామెంట్స్‌పై ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. అధినేత క్లాస్‌తో జగన్‌పై మంత్రులు విమర్శల దాడి పెంచుతుండడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
ఈ నెల 9న జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశించారు. వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మంత్రులదేనన్న చంద్రబాబు… అలా చేయని వాళ్లు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అన్నారు. రెస్పాన్స్ సరిగా లేకుంటే కొత్తవాళ్లకు చాన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. కేబినెట్లో చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్‌తో మంత్రులంతా అలెర్ట్ అయ్యారు.
ఒక్కొక్కరుగా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. జగన్‌ను టార్గెట్ చేయడంలో డోస్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు ఏపీ హోంమంత్రి అనిత. విజయనగరంలో పర్యటించిన మంత్రి అనిత.. గత ప్రభుత్వం కక్ష సాధింపులకు కేరాఫ్‌గా నిలిచిందని ఆరోపించారు. ఇక.. జగన్‌పై మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు వాళ్ల అధినేత బాటలో పయనిస్తూ ఇష్టారీతిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
మొత్తంగా.. మొన్నటి కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు క్లాస్ మంత్రులకు బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. వైసీపీ విమర్శలకు కౌంటర్లు ఇస్తూ కాక రేపుతున్నారు.