ఆంధ్రపద్రేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. నాలుగు దశల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తై ఫలితాలు కూవా వచ్చేశాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్ఈసీకి లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇప్పటికే ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇచ్చి ఉంటే ఎస్ఈసీ విచారణ జరపరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే ఆ ఫలితాలు వెల్లడించవద్దని, నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
కాగా, బలవంతపు ఏకగ్రీవాలపై సమీక్షిస్తామని ఎస్ఈసీ గతంలో చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తాజా ఉత్తర్వులు ప్రభావం చూపే అవకాశం ఉంది. బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటే, తాము పరిశీలించి మళ్లీ నామినేషన్ వేసే వెసులుబాటు కల్పిస్తామని ఎస్ఈసీ ఇంతకుముందు పేర్కొన్నారు. ఓ దశలో పూర్తిస్థాయిలో తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఎస్ఈసీ ఆలోచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చినట్టయింది.
Read more: