CPM – CHINA: భారత్‌కు పక్కలో బల్లెంలా మారిన డ్రాగన్ కంట్రీ చైనాపై కమ్యూనిస్టు నాయకులు చేస్తున్న ప్రకటనలు ఇప్పువు పెద్ద చర్చకు దారి తీసుకున్నాయి. ఆయా పార్టీకి చెందిన కొందరు నేతలు చైనా తీరును విమర్శిస్తుండగా మరికొందరు నాయకులు వత్తసు పలుకుతున్నారు. మొన్నటి మొన్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత ఎస్ రామచంద్రన్ పిళ్లై చైనాను ప్రశంసించడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విభేదించారు. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా సోషలిస్టు దేశం చైనా సరైన వైఖరి తీసుకోలేకపోయిందని సీఎం విజయన్ అన్నారు. సీపీఐ(ఎం) గత పార్టీ కాంగ్రెస్ సైద్ధాంతిక తీర్మానం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని పినరయి విజయన్ స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) తిరువనంతపురం జిల్లా సదస్సును ప్రారంభించిన అనంతరం కేరళ ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు.
కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించిన 24 గంటల్లోనే అంటే గురువారం సీపీఐ(ఎం) కొట్టాయం జిల్లా సదస్సులో మాత్రం అదే పార్టీకి చెందిన ఎస్ రామచంద్రన్ పిళ్లై చైనాకు అనుకూలంగా ప్రకటన చేశారు. చైనాను భారత్‌తో సహా దేశాలు చుట్టుముట్టి దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు.
మరో నేత కూడా చైనాకు అనుకూల ప్రకటన చేశారు. తిరువనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ కూడా అదే స్థాయిలో మద్దతు పలికారు. ప్రపంచీకరణ జరుగుతున్న ఈ సమయంలో చైనా కొత్త బాటలు వేస్తోందని.. ఆధునిక సోషలిస్టు విధానాన్ని రూపొందిస్తోందని సీపీఎం నేత డ్రాగన్ కంట్రీని ఎత్తుకున్నారు.
2021లో చైనా పేదరికాన్ని నిర్మూలించిందని అంటూ ప్రశంసలతో ముంచేశారు. తిరువనంతపురం జిల్లా సదస్సులో జరిగిన చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, కొంతమంది ప్రతినిధులు చైనా వైఖరి సోషలిస్టు రాజ్యానికి అనుగుణంగా లేదని విమర్శించారు. దీనిపై కొడియేరి స్పందిస్తూ.. చైనాను ప్రశంసిస్తూ.. సోషలిస్టు వ్యవస్థను తీర్చిదిద్దడంలో కమ్యూనిస్టు దేశం బాగా పనిచేస్తోందని అనడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
చైనా కొత్త అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. చైనా చర్యలను తప్పక అంగీకరించాలని ఆయన అన్నారు. కమ్యునిస్టు నాయకులు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వారికే చుట్టుకుంటున్నాయి. ఒకరు కాదంటే మరొకరు అదే నిజం అనే స్థాయిలో విన్నాయి.
ఇవి కూడా చదవండి: MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..