గుజరాత్ : లోక్‌సభ ఎన్నికల నగారా మోగగానే రాజకీయ పార్టీలన్నీ తమ ‘సన్నాహాలను ముమ్మరం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి ప్రధాని మోదీ సొంతగడ్డపై నుంచే నాంధి పలకేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ సొంతగడ్డగా పేరొందిన గుజరాత్‌లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల సన్నాహాల గురించి చర్చించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు పార్టీకి చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సుమారు 58 ఏళ్ల అనంతరం గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పాటీదార్ నేత హార్ధిక్ పటేల్ ఈ సమావేశాలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం క్రితమే రాహుల్ ని కలిసినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో.. నేడు రాహుల్ సమక్షంలోనే కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హార్దిక్ పటేల్ జామ్‌నగర్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హార్దిక్ పటేల్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనముద్ర వేశారు. కాగా కాంగ్రెస్ ఈ సమావేశాన్నిగతంలో ఫిబ్రవరి 27న నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బాలాకోట్‌లో జరిగిన ఎయిర్ స్ట్రయిక్ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ రోజు జరగనున్న సమావేశంలో ముందుగా మహాత్మాగాంధీకి నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రసంగించనున్నారు.