
పీసీసీ చీఫ్ నియామకం తర్వాత విమర్శలను గుప్పించిన ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారిగా తన వాయిస్ మార్చేశారు. వేదాంత ధోరణిలో మాట్లాడటం మొదలు పెట్టారు. ఇక ముందు తాను రాజకీయాలు మాట్లాడబోనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్దే వంటి అంశాలపైనే తన ఫోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఇకముందు తాను ముందుకు వెళతాన్నన్నారు. తన కృషి ఫలితంగానే ఈరోజు గౌరిల్లి జాతీయ రహదారి సాధ్యం అయ్యిందన్నారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. తాను మాట్లాడేది కేవలం అభివృద్ధి గురించి మాత్రమే అని వెల్లడించారు. ఇక ఎంపీగా తాను చిల్లర రాజకీయాలు మాట్లాడనని వ్యాఖ్యానించారు.
అయితే.. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమించడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో చాలా హాట్ హాట్ విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు ఢిల్లీకి వెళ్లాక తెలిసిందంటూ కామెంట్ చేయడం.. ఆ తర్వాత రెండు రోజుల గడిచిందో లేదో ఇక రాకీయాలు మాట్లాడేది లేదంటూ వెనక్కి తగ్గారు.
ఇదిలావుంటే.. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో వినిపించిన అసమ్మతి రాగాలు ఇప్పుడు ఒక్కసారిగా మాయం అయ్యాయి. ఒకరిద్దరు నేతల్లో మినహా మిగిలినవారిలో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహం కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.