
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరాలు తెలిపారు. ఈసీని కలిసిన అనంతరం కేంద్రమంత్రి, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మేము అసంతృప్తి వ్యక్తం చేశాము. ఆయన చేస్తున్న ప్రకటనలు నిరాధారంగా, అమర్యాదకరంగా ఉంటున్నాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఆరోపించారు.
‘లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో చెలరేగుతున్న హింస గురించి కూడా మేము ఈసీతో చర్చించాము. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ కేంద్ర బలగాలను మోహరింప చేయాలి. అలా చేస్తేనే శాంతియుత వాతావరణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి’ అని నఖ్వీ వ్యాఖ్యానించారు.