నాలుగు నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం పనుల్లో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల విషయంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలను పాటించారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ గతంలో ఎందుకు రేటు తగ్గించి టెండర్ వేసిందని ప్రశ్నించారు. పీపీఏల రద్దు వల్ల ఏపీకి కొత్తగా పరిశ్రమలు రాకపోవడమే కాకుండా దేశానికే చెడ్డపేరు వస్తుందని తెలిపారు. వైఎస్ హయాంలో భూసేకరణ పూర్తయితే ఇంత సాగదీత ఉండేదికాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ఏపీని పార్టీలు, కులాలు, మతాలుగా విభజించి పరిపాలన చేస్తారా అని నిలదీశారు. ఏపీని లా లెస్ రాష్ట్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయాలని. ప్రాజెక్టులో 67 శాతం పనులు పూర్తయినట్లు గత ప్రభుత్వం వెల్లడించిందని.. మిగతా ఏయే పనులు పెండింగ్‌లో ఉన్నాయనే అంశంపై ప్రజలకు వివరించాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు అద్దెకు ఉన్న ఇంటి చుట్టే రాజకీయం అంతా తిప్పడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే అన్నట్టు ఉన్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లలో గతంలో ఎల్2గా వచ్చిన సంస్థ ఈసారి తక్కువ ధరకే బిడ్ వేసిందంటే అందులోని లోగుట్టు చెప్పాలని ప్రభుత్వాన్ని సుజనా నిలదీశారు.