తెలంగాణ కమల దళపతిపై కొనసాగుతన్న రచ్చ.. తేలేదీ ఎప్పుడంటే?
తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవిపై గతంలో ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం జాతీయ నాయకత్వానికే కొన్ని కండీషన్స్ పెట్టారు కొందరు నేతలు. ప్రెసిడెంట్ ఎంపికలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు మరికొందరు నేతలు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, రాంచందర్ రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే ఎలాంటివారిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న విషయంపై జాతీయ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను రాష్ట్ర కమిటీకి అప్పగించవద్దని గోషా మహల్ ఎమ్మెల్యే అన్నారు. అలా చేస్తే అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్గానే ఉంటారన్నారు. అందుకే కేంద్ర కమిటీనే ప్రెసిడెంట్ను ఎంపికచేయాలని రాజాసింగ్ కోరారు. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దన్నారు. ధర్మం కోసం పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు.
బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు. ప్రెసిడెంట్ పదవి వస్తుందని తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోనన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో.. కార్యకర్తలు ఎలా ఉండాలో బండి సంజయ్ చెప్పారు. ఇదిలావుంటే, అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
గ్రూపులకు తావు లేకుండా అందరినీ కలుపుకుని పోయే నేత కోసం అధిష్టానం వడపోస్తుందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, రాంచందర్ రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. తాను రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించడంతో మల్కాజిగిరి నేతల్లో ఒకరికి లైన్ క్లియర్ అయినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. అయితే హైకమాండ్ లెక్కలు వేరే ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు. రేసులో లేని నేతలకు సైతం పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఉగాది కల్లా కొత్త సారథి ఎవరో క్లారిటీ వస్తుందంటున్నారు కమలనాథులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..