Badvel By Election – Sajjala Ramakrishna Reddy : బద్వేల్‌లో ప్రచారాన్ని ఉధృతం చేసింది అధికార వైసీపీ. ఇవాళ పార్టీ కార్యకర్తలు, నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యకర్తలు, నేతలకు బైపోల్ లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. బద్వేల్‌లో ఓటింగ్ ఏకపక్షంగా ఉండాలని, వైసీపీకి అత్యధిక మెజార్టీ రావాలని కార్యకర్తలకు చెప్పారు సజ్జల. ఒకవేళ ఎవరైనా పోటీ పెడితే మాత్రం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రయత్నించాలన్నారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి.. బద్వేల్ ఉప ఎన్నికలో డాక్టర్ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని సజ్జల సూచించారు. పేదల జీవితాలు మెరుగుపడాలని, పేదరికం నుంచి బయటపడాలని, రాష్ట్రంలోని పేద కుటుంబాలు బంగారు భవిష్యత్తులోకి వెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు.
కేవలం సంక్షేమమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం జగన్ అడుగులు వేయిస్తున్నారని సజ్జల తెలిపారు. రాజకీయం అంటే ఎన్నికల సమయంలోనే ఆర్భాటాలు చేయడం గతంలో చూశాం.. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మేనిఫెస్టోలోని హామీలనే కాకుండా.. మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో జరిగిన వైయస్‌ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అభ్యర్థి డాక్టర్ సుధ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Read also: MP Rammohan Naidu: నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలు.. బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారు