రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు చేసింది రాజకీయ డ్రామా అని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు వున్నాయని, ఎన్నికల నియమావళి అమలులో వుందని తెలిసి కూడా అనుమతి లేకుండా ఏ రకంగా నిరసనలు చేపడతారో చంద్రబాబు స్పష్టం చేయాలని అన్నారు. నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం అన్న చంద్రబాబుకు ఈ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
రానున్న రోజుల్లో మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ లలో కూడా వైయస్‌ఆర్‌సిపి ఇంతకన్నా మెరుగైనా ఫలితాలనే సాధించబోతోంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులు ఎనబై శాతంకు పైగా విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని తెలిసినా.. చిత్తూరు జిల్లాలో ఏదో జరిగిపోతోందనే భ్రమలను కల్పించేందుకే చంద్రబాబు తన పర్యటన పెట్టుకున్నాడు. తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కోసమే ఈ డ్రామా అని పెద్దిరెడ్డి అన్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు హైడ్రామా దృశ్యాలను ఎవరు చిత్రీకరించారు? ఎవరు మీడియాకు రిలీజ్ చేశారు? ఇదంతా చూస్తుంటే చంద్రబాబు కుట్రపూరితంగా ఈ హంగామా చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు జరగబోయే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి కనిపిస్తోంది. తన పార్టీ నుంచి ఎవరూ నామినేషన్లు వేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈపరిస్థితుల్లో ప్రభుత్వంపై బురదచల్లాలని, తనకు కావాల్సిన మీడియాలో ఏదో అన్యాయం, అక్రమాలు జరిగిపోతున్నట్లు ప్రచారం కల్పించుకునేందుకు నానా యాగీ చేస్తున్నాడని పెద్దిరెడ్డి విమర్శించారు.
చిత్తూరు జిల్లాలో ఆయన రాజకీయానికి నూకలు చెల్లిపోయాయి. టిడిపి కోటకు బీటలు పడ్డాయి. మొత్తం పునాదులే కదిలిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం చంద్రబాబుది కాదు.. ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీ. చివరికి చంద్రబాబుకు ఈపార్టీ కూడా వుండదు. భవిష్యత్తులో ఆయన ఉనికి కూడా రాజకీయాల్లో వుండదు. చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తానని చంద్రబాబు ట్విట్టర్ లో చెప్పాడు. గాంధీగారి విగ్రహం వద్ద ఆందోళన చేస్తే… తనను గాంధీ అని అనుకుంటారని చంద్రబాబు భావిస్తున్నాడా? చంద్రగిరిలో ఓడిపోయి… కుప్పంకు పారిపోయి… ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఎక్కడికి పోతాడో తెలియని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.
పోలీస్ యాక్ట్ 30, ఎన్నికల నియమావళి అమలులో వుంది. కోవిడ్ సెకండ్ వేవ్ వున్న నేపథ్యంలో రావద్దు… అని పోలీసులు తమ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా కూడా చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పర్యటన పెట్టుకున్నాడు. మధ్యాహ్నం రెండుగంటలకే ఆయనకు అధికారులు ఆహారం కూడా అందించారు. తన అనుకూల మీడియాకు ఫోజులు ఇచ్చేందుకే చంద్రబాబు కింద కూర్చున్నారు. తరువాత పోలీసులు ఆయనను గౌరవంగా లాబీలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఎయిర్‌పోర్ట్ లో చంద్రబాబును ఎవరు నిర్భంధించారు? ఎవరు అరెస్ట్ చేశారు? పోలీసులు ఆయనతో ఎంతో మర్యాదగా వ్యవహరించారు. ఎన్నికల నిబంధనల మేరకు మీరు రావద్దని ముందుగానే పోలీసులు ఆయనకు లేఖ రాశారని పెద్దిరెడ్డి చెప్పారు.
చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు తాను ప్రతిపక్ష నేతతో ఎలా వ్యవహరించాడో ఆయనకు గుర్తులేదా? ఆనాడు ఎటువంటి కోవిడ్ నిబంధనలు, ఎన్నికల నియమావళి లేనప్పుడు ప్రత్యేకహోదా కోసం ప్రజల ఆకాంక్షలకు సంఘీభావం ప్రకటించేందుకు విశాఖలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వెడితే… శ్రీ వైయస్ జగన్ పట్ల ఎలా వ్యవహరించారో తెలియదా? రన్‌వే మీదనే శ్రీ వైయస్ జగన్ ను అడ్డగించి, వెనక్కి పంపించిన విషయం నిజం కాదా? మా ప్రభుత్వంలో అధికారులు మీలా వ్యవహరించారా? లేదు.
ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుంది. 67 మంది వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేల నుంచి 23 మందిని ప్రలోభాలతో పార్టీ ఫిరాయింపులకు చంద్రబాబు ప్రోత్సహించలేదా? వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వలేదా? మండల, జెడ్పీ ఎన్నికల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ గెలిచిన మా పార్టీ వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించేట్లు చేయలేదా? వారికి పదవులు కట్టబెట్టలేదా? అటువంటి చంద్రబాబు సిగ్గూ, శరం లేకుండా ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు.
అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన హామీల్లో 90 శాతం అమలు చేశాం. మీలా మేం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే… తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అసలు మిగులుతారా? ప్రజాబలంతోనే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలన్నది మా సీఎం శ్రీ వైయస్ జగన్ గారి ఆశయం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసే వైయస్‌ఆర్‌సిపికి అండగా ప్రజలు నిలుస్తున్నారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు వాయిదా వేశాడు? అప్పుడు ఎన్నికలు జరిగితే తనకు ప్రతికూల ఫలితాలు వస్తాయని భయపడలేదా?
ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరు. ఇకనైనా చంద్రబాబ తన డ్రామాలను కట్టిపెట్టి, తిరిగి ప్రయాణమవ్వాలి. జిల్లా యంత్రాంగాన్ని, పోలీసులను, ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను మానుకోవాలి. ఈ రాష్ట్రంలో వలంటీర్లు మా పార్టీకోసం పనిచేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలను ఇంటింటికీ ఇచ్చేందు కోసం పనిచేస్తున్నారు. మా పార్టీకి మద్దతు ఇవ్వమని వారికి ఏనాడు చెప్పలేదు. మంచి సేవలు చేసిన వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు ఇస్తున్నాం. వాలంటీర్లకు రాజకీయం పులమడం సరికాదని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు.
Read more: