విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పోరాటం తీవ్రమైంది. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పు నిప్పుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కటవుతున్నారు. కార్మికుల పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని వైసీపీ ఎంపీలు ప్రకటిస్తే.. ప్రాణత్యాగానికి సిద్దమంటున్నారు టీడీపీ నేతలు.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని ఆనాడు ఉద్యమించి సాధించుకుంటే.. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని మండిపడుతున్నాయి కార్మిక సంఘాలు. అన్ని పార్టీలు వారి పోరాటానికి మద్దతు ఇచ్చాయి. అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించారు వైసీపీ ఎంపీలు. మరోవైపు ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్నారు TDP విశాఖ ఎమ్మెల్యే రామకృష్ణబాబు.
మరోవైపు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై రాష్ట్రానికి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. కార్మిక సంఘాలు, వివిధ వర్గాల ఆందోళన నేపథ్యంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చారు వైసీపీ ఎంపీలు. విశాఖ, అనకాపల్లి ఎంపీలు ఇద్దరూ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రామ్మోహన్ నాయుడు. లేదంటే ఢిల్లీ రైతు ఉద్యమం తరహాలోనే పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.