అమరావతి : కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో ఓటర్లందూ ప్రతిరోజూ మూడు పూట్ల చెక్ చేసుకోవాలని సూచించారు. పొద్దున్న, మధ్యాహ్నం, అలాగే, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తమ ఓటు ఉందో లేదో చూసుకోండని చెప్పారు. అవసరమైతే, రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా ఓసారి చెక్ చేసుకోవాలని, ఎందుకంటే, ఓటు లేకుండా చేసేందుకు కొంత మంది చూస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ ఐదు రోజుల పాటు ఓటర్లందరూ తమ ఓటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని, ముఖ్యంగా, యువత తమ ఓటు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐదేళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశామని, అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని అందించామని చంద్రబాబు అన్నారు. విభజన హామీలను నెరవేర్చకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఐదేళ్ల పాలనలో సమర్థవంతంగా పని చేశామని చంద్రబాబు అన్నారు.