‘‘మా జిల్లా మాఫియా ముఠాలకు అడ్డాగా మారింది… కాస్త చూడండి…‘‘ ఈ మాటలన్నది ఎవరో సామాన్యుడైతే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఈ మాటలన్నది మాజీ మంత్రి. అది కూడా ఏపీలో అధికార పార్టీ వైసీపీలో కొనసాగుతున్న నేత. అధికార పార్టీలో వుంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందన్నది ఆయన కామెంట్ల సారాంశం. దాన్ని అరికట్టాలని అడుగు ముందుకేసే అధికారులకు ఉద్యోగ భద్రత కరువైందని ఆయనంటున్నారు.
నెల్లూరు బాగా డెవలప్ అయ్యింది.. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఇలా మీకు ఏ మాఫియా కావాలన్నా నెల్లూరుకు రండి.. ఇక్కడే అందరూ దొరుకుతారు. ఈ మాఫియాల ఆగడాలకు నెల్లూరు నగరంలో వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. బయటికి చెప్పుకోలేక చస్తున్నారు. ఐదు సంవత్సరాలలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరు జిల్లాకే దక్కిందన్నది ఆనం వెర్షన్.
నిజానికి ఇలాంటి కామెంట్లను ఏ విపక్ష నేతలో అంటుంటారు. కానీ అధికార పార్టీలో వుండి ఇలాంటి కామెంట్లు చేశారంటే ఏదో వ్యూహం.. ఇంకేదో అంతరార్థం వుండి వుంటుంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విషయంలోను వ్యూహం, అంతరార్థం రెండు వున్నాయంటున్నారు జిల్లా రాజకీయాలకు సుపరిచితులైన విశ్లేషకులు. ఇందుకు మూడు ప్రధానమైన రీజన్లను చూపిస్తున్నారు.
ఆనం కుటుంబం నెల్లూరు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తర్వాత ఆనం కుటుంబానిదే నెల్లూరులో పెద్దరికం. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆనం వారి రాజకీయాలే సింహపురిని శాసించాయి. అయితే ఆ తర్వాత తరం మారింది. తాజాగా ఏర్పడిన జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు ఆనం రామనారాయణ రెడ్డి. మరోవైపు ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి తనువు చాలించారు.
ఇదే సమయంలో జిల్లాలో కొత్త తరం రాజకీయనాయకులు వచ్చి సందడి షురూ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి.. ఆ తర్వాత 2018లో వైసీపీలోకి మారారు రామనారాయణ రెడ్డి. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రామనారాయణ రెడ్డి ప్రాభవం గణనీయంగా తగ్గడం మొదలైంది. జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వేణుగోపాల స్వామి ఆలయం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆనం రామనారాయణ రెడ్డిలో అసహనానికి కారణమని జిల్లాలో అందరూ చెప్పుకుంటున్నారు. వేంకటగిరి సంస్థానాధీశుల ఆనవాయతీ ప్రకారం అయిదు కుటుంబాలు ఈ దేవస్థానం ట్రస్టీలుగా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఆలయ ట్రస్టీల కమిటీని రద్దు చేసి, ప్రభుత్వం తరపున ఆలయ కమిటీని నియమించేందుకు రంగం సిద్దమవుతోంది. దాంతో ఆనం కుటుంబ పెద్దరికం ఆ ఆలయం మీద కనుమరుగవుతుంది. దీని వెనుక అనిల్ కుమార్ మంత్రాంగం వుందని ఆనం అనుమానిస్తున్నారు.
జిల్లాలో వున్న అల్తూరుపాడు రిజర్వాయర్ కూడా మరో ప్రధాన అంశంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణ వ్యయం 250 కోట్లు కాగా.. రివర్స్ టెండరింగ్ విధానంలో 4 శాతం అధికంగా కోట్ అయ్యిందన్న సాకుతో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టెండర్‌ను రద్దు చేయించారు. అధికార పార్టీలో వుండి కూడా ఈ టెండర్ కాపాడుకోలేకపోయాన్న అసంతృప్తి ఆనంలో పెరిగిపోయిందంటున్నారు.
రామనారాయణ రెడ్డి అసంతృప్తికి మరో ప్రధాన అంశం వి.ఆర్. విద్యాసంస్థలు. వేంకటగిరి రాజావారు నెలకొల్పిన ఈ వి.ఆర్. విద్యాసంస్థలపై ఆనం ఫ్యామిలీ పెద్దరికం చేసేది. ఇప్పుడు ఆ పెద్దరికం పోయి జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలోకి ఆ విద్యాసంస్థలు చేరిపోయాయి.
ఇలా ఈ మూడు ప్రధానాంశాలు ఆనం వారి నోట మాఫియా వంటి హార్డ్‌కోర్ పదజాలాన్ని వెల్లగక్కించాయని చెబుతున్నారు జిల్లా రాజకీయాలు చిరకాలంగా సునిశితంగా పరిశీలిస్తున్నవారు. సో.. నేతల మాటల వెనుక అర్థాలు, అంతరార్థాలు వేరే వుంటాయనడానికి తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నమాట.