
వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా నోరూరించే మామిడి పండ్లు దర్శనమిస్తుంటాయి. రసాలు, బంగినపల్లి, తోతాపురి, నీలం ఇలా ఎన్నో రకాల మామిడి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ఒక్కో రకాన్ని బట్టి కిలో మామిడి ఒక్కో రేటు ఉంటుంది. 100 రూపాయల నుంచి మొదలు 300 వరకు ధర పలకడం కామన్. కానీ, ఈ మామిడి మాత్రం ఏకంగా రెండున్నర లక్షలు దాటుతుంది. ఏంటీ అది మామిడి పండా బంగారామా అనుకునేరు. బంగారం లాంటి మామిడి పండే.. పోషకాలు పుష్కలంగా ఉండే మామిడి పండు అది. పేరు మియాజాకి, పండేది చల్లని వాతవరణం ఉండే జపాన్ దేశంలో. అక్కడ పండే ఆ రకం మామిడిని ఇప్పుడు నిర్మల్‌లోని ఓ ఆయుర్వేద వైద్యుడు సాగు చేసి భళా అనిపించుకుంటున్నాడు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు మియాజాకీని నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాపల్లి సత్యం ఈ మియాజాకి రకం మామిడి పండ్లను సాగు చేశారు. ఈ రకం మామిడి శీతల ప్రాంతంలోనే పెరుగుతుందని, స్థానికంగా ఉన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోదని కొందరు వారించినా ఆయన వినలేదు. ఓసారి ప్రయత్నించి చూద్దామని మూడేళ్ల క్రితం కేరళలోని ఓ ఏజెన్సీ ద్వారా ఒక్కో మొక్కకు రూ.10 వేలు ఖర్చు పెట్టి 6 మొక్కలను తెప్పించి నాటారు. వాటిలో ఒకటి ఎండిపోగా, మిగతా 5 మొక్కలు మాత్రం ఇక్కడి పరిస్థితులను తట్టుకుని పెరిగాయి. వర్మికంపోస్ట్, గోమూత్రం, కషాయాలు, వంటి సేంద్రియ ఎరువులు వేసి మొక్కలను సంరక్షించాడు. రెండేళ్ల తర్వాత మొదటి కాత వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 20 కాయాలుకాసాయి. అంతర్జాతీయ మార్కెట్ మియజాకీ పండ్లు కిలోకు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు ధర పలుకుతాయి.

గతేడాది మరో పది చెట్లను తెప్పించి నాటినట్లు పేర్కొన్నాడు. మియజాకీ పండ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడానికి కారణం అందులో ఉండే ఔషధ గుణాలేనని ఆయన వెల్లడించారు. శరీరానికి రక్షణనిచ్చే రోగ నిరోధకశక్తి అత్యధికంగా ఉంటుందని, శరీరంలోని వ్యర్ధాలను తొలగించే ఔషధ గుణాలు ఇందులో పుష్క లంగా ఉంటాయన్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందన్నారు. సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందన్నారు. ఏ, బీ, సీ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయని ఆయన వివరించారు.

1984లో మొట్టమొదట జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో పండించిన మామిడికి జపాన్‌తో పాటు కాలిఫోర్నియాలో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలికిన మియాజాకి రకంపై పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జపాన్‌కు చెందిన మియాజాకి నగరం పేరుతో సాగయ్యే ఈ మామిడి రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఇంతటి ఖరీదైన మామిడిని బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇప్పుడు భారత్‌లోనూ సాగు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాపల్లి సత్యం సాగు చేసిన మియాజాకీ రకానికి చెందిన ఒక్కో మామిడి పండు బరువు దాదాపు 330 గ్రాములు ఉంది. యాంటీ యాక్సిడెంట్ బీటా-కెరొటిన్ తోపాటు ఫోలిక్ యాసిడ్ లక్షణాలను కలిగి ఉన్న ఈ పండులో చక్కెర 15 నుంచి 20 శాతం మాత్రమే ఉంటుందన్నారు. అందుకే ఈ పండు మరింత రుచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏ, సీ, ఈ, కే, విటమిన్లూ ఉండటంతో ఆరోగ్యానికీ మంచిదంటున్నారు.