కార్తీక పౌర్ణమి రోజున.. (నవంబర్ 19న) చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం పాక్షికంగా ఉంటుంది. మనదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణకు అనేక ప్రత్యేకతలున్నాయి. 580 ఏళ్ల తర్వాత ఈసారి సుధీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ గ్రహణం దాదాపు మూడున్నర గంటలపాటు ఉంటుంది.
అరుణాచల్ ప్రదేశ్.. అస్సాంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ గ్రహణం కనిపిస్తుందని ఎంపీ బిర్లా ప్లానిటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్స్ డైరెక్టర్ దేబీ ప్రసాద్ దువారీ తెలిపారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని తెలిపారు. తూర్పు హెరిజోన్కు అతి సమీపంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత చివరి క్షణాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుందని చెప్పారు.
గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని.. ఇది 580 ఏళ్లలో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం అవుతుందని దువారీ చెప్పారు. ఈ గ్రహణం 1440 ఫిబ్రవరి 18న చివరిసారిగా ఏర్పడిందని.. ఆ తర్వాత 2669వ సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఇలాంటి ఘటన కనిపించిందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి గ్రహణం కనిపిస్తుందని.. కానీ ఈ ప్రాంతాల నుంచి కొంత సమయం మాత్రమే గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. గరిష్ట పాక్షిక గ్రహణం మధ్యాహ్నం 2.34 గంటలకు కనిపిస్తుంది. చంద్రునిలో 97 శాతం భూమీ నీడతో కప్పబడి ఉంటుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలో కనిపిస్తుంది.
ఈ పాక్షిక గ్రహణం ఉదయం 11.32 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.33 గంటలకు ముగుస్తుందని దువారీ తెలిపారు. సూర్యుడు, భూమి, చంద్రుడు సంపూర్ణంగా ఒకే రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక గ్రహణం మాదిరిగానే నీడ గ్రహణం వాస్తవికంగా ఉంటుందని తెలిపారు.
తర్వాత చంద్రగ్రహణం 2022 మే 16న ఉంటుందని.. ఈ గ్రహణం భారత్ నుంచి కనిపించదని చెప్పారు. భారతదేశం నుంచి కనిపించే చంద్రగ్రహణం నవంబర్ 8న 2022న ఉంటుంది.