
మధుమేహ వ్యాధిగ్రస్తులు, పీసీఒడీ బాధితులు అందరూ ఒకే ఆహార పద్దతిని అనుసరించకూడదు. అలాగే స్త్రీ పురుషుల ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. వయస్సు, బరువు, శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకుని డైట్ చార్ట్ తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆహారం అవసరం. ఇంట్లో ఇంటి సభ్యులందరినీ చూసుకునే మహిళలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అయితే మహిళలు తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాలను నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

గుడ్లు.. దీనిలో ప్రొటీన్లతో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. మహిళల్లో విటమిన్ డి సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఈ పోషకం రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, దంతాలను బలోపేతం చేయడానికి, సరైన థైరాయిడ్ హార్మోన్ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే గుడ్లు తినడం చాలా అవసరం.

పెరుగు ప్రోబయోటిక్స్‌తో కూడిన గొప్ప ఆహారం. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దృఢమైన ఎముకలు, దంతాలను నిర్మించడంలో సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడే మహిళలు రోజూ పెరుగు తీసుకోవాలి.

పీసీఒడీ, థైరాయిడ్, రక్తహీనత వంటి సమస్యలు మహిళల్లో సర్వసాధారణం. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కూరగాయలు అందమైన, మచ్చలేని చర్మాన్ని పొందడంలో కూడా సహాయపడుతుంది.

ఓట్స్ .. మహిళలకు బరువు నియంత్రణ చాలా ముఖ్యం . బరువు పెరగడం వల్ల మధుమేహం, పీసీఓడీ, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఓట్స్ అల్పాహారంగా తీసుకోవచ్చు. ఓట్స్‌లో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది.

డ్రై ఫ్రూట్స్ .. అంటే వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు వంటి రకరకాల నట్స్‌లో మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే నిద్రలేచి నానబెట్టిన బాదంపప్పులను తింటే శరీరంలో పోషకాల కొరత ఉండదు. బాదంపప్పును స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచుతుంది. డ్రై ఫ్రూట్స్‌తో పాటు చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ , గుమ్మడి గింజలు వంటి నట్స్ కూడా తినవచ్చు.