
మీరు ఉల్లిపాయపై నల్ల మచ్చలను గమనించినట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి ఆ మచ్చలు ఫంగస్. ఉల్లిపాయలు నేలలో పెరుగుతాయి. ఈ ఫంగస్ అయిన ఆస్పెర్‌గిల్లస్ నైగర్ నేల ద్వారా ఉల్లిపాయలోకి ప్రవేశిస్తుంది. ఈ నల్లటి బూజు అంత త్వరగా ప్రమాదకరం కానప్పటికీ.. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే అలెర్జీ ప్రతిచర్యలను పెంచుతుంది.

నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు, పిల్లలు, వృద్ధులు అస్సలు తినకూడదు. ఉబ్బసం, క్షయ, హెచ్‌ఐవీ ఉన్న రోగులు ఈ ఫంగస్‌తో కూడిన ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి.

డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇవి చాలా హానికరం. ఈ ఫంగస్ ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంది. ఉబ్బసం రోగులలో, ఈ ఫంగస్ అలెర్జీ దాడికి కారణం కావచ్చు.

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఉల్లిపాయను తినే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. ఉల్లిపాయపై నల్ల మచ్చలు బయటి తొక్కపై మాత్రమే ఉంటే, దానిని పూర్తిగా తీసివేసి శుభ్రం చేసి వాడుకోవచ్చు. అయితే లోపలి పొరపై కూడా నల్ల మచ్చలు ఉంటే, ఆ ఉల్లిపాయను పొరపాటున కూడా తినకూడదు.

ఉల్లిపాయలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం కూడా త్వరగా చెడిపోవడానికి కారణమవుతుంది. ఉల్లిపాయలను ఎప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. ఫ్రిజ్‌లో తేమ వల్ల అవి త్వరగా పాడవుతాయి. తరిగిన ఉల్లిపాయలను గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. బంగాళాదుంపలతో కలిపి ఉల్లిపాయలను నిల్వ చేస్తే అవి త్వరగా చెడిపోతాయి.