
ఏమిటీ బ్రహ్మ ముహూర్తం? సమయం ఎంత?: సూర్యోదయానికి సరిగ్గా 96 నిమిషాల ముందు ప్రారంభమయ్యే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయం సమయాన్ని బట్టి ఇది మారుతుంటుంది. కానీ సాధారణంగా తెల్లవారుజామున 4:00 నుండి 5:30 గంటల మధ్య సమయాన్ని దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సమయంలో మేల్కొనడం వల్ల శరీరంలో ప్రాణవాయువు ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

వాతావరణంలో అద్భుతం: శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. తెల్లవారుజామున వాతావరణంలో ఓజోన్ వాయువు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఓజోన్ మిశ్రమిత గాలి మెదడు కణాలకు అమృతం లాంటిది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా, ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 99 శాతం మంది ఈ సమయంలో నిద్రలో ఉంటారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఉండదు, మానసిక ప్రశాంతత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అందుకే రచయితలు, శాస్త్రవేత్తలు, విద్యార్థులకు ఇది గోల్డెన్ అవర్.

సర్కాడియన్ రిథమ్: మన శరీరంలో కాంతి, చీకటికి అనుగుణంగా స్పందించే ఒక జీవ గడియారం ఉంటుంది. దీనినే సర్కాడియన్ రిథమ్ అంటారు. మనల్ని యాక్టివ్‌గా ఉంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు ఉదయం 6:00 నుండి 8:30 గంటల మధ్య పెరగడం ప్రారంభిస్తాయి. ఒకవేళ మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోకుండా ఉదయం 9 లేదా 10 గంటల వరకు నిద్రపోతే, పెరిగిన కార్టిసాల్ స్థాయిలు సరిగ్గా వినియోగించబడవు. ఫలితంగా రోజంతా నీరసం, తలనొప్పి, బద్ధకం ఆవహిస్తాయి.

ఎవరికి ఎంత నిద్ర అవసరం: నిద్రలేవడం ఎంత ముఖ్యమో, సరైన నిద్రను పొందడం కూడా అంతే ముఖ్యం. తక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్య నిపుణుల లెక్కల ప్రకారం..6 నుంచి 13 ఏళ్ల పిల్లలు 9 నుంచి 11 గంటల నిద్రపోవాలి. 18 నుంచి 25 ఏళ్ల యువత 7 నుంచి 9గంటల నిద్రపోవాలి. 26 నుంచి 64 ఏళ్ల వ్యక్తులు 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. ఇక వృద్ధులు 7 నుంచి 8గంటల నిద్రపోవాలి.

మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా లేదా కష్టమైన సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నా బ్రహ్మ ముహూర్తమే సరైన సమయం. ఈ సమయంలో మెదడులో ఆల్ఫా తరంగాలు చురుగ్గా ఉంటాయి. ఇవి సృజనాత్మకతను, ఏకాగ్రతను ప్రేరేపిస్తాయి. ప్రకృతి నియమాలను అనుసరించడం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే. తెల్లవారుజామున నిద్రలేవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ఆరోగ్య రహస్యం. రేపటి నుండే ఈ మార్పును ప్రయత్నించి చూడండి.