
చీమలు ప్రతి ఇంట్లో దర్శనమిస్తాయి. తీపి పదార్ధాలు ఎక్కడైనా పెడితే డిటెక్టివ్ మాదిరి గాలించి.. ఎలాగోలా అందులో దూరేస్తాయి. అయితే చీమల ప్రవర్తనను మీరెప్పుడైనా గమనించారా? అవి ఏ పని చేసినా ఓ పద్ధతి ప్రకారం, ఎవరో అదేశాలు జారీ చేసినట్లు ఒకే రీతిలో ప్రవర్తిస్తుంటాయి.

ముఖ్యంలో చీమల గుంపులో ఏదైనా ఒక చీమ చనిపోతే దాని చుట్టూ ఇతర చీమలు గుమిగూడి చనిపోయిన చీమను వేరే ప్రదేశానికి తీసుకువెళుతుండటం మీరు చూసే ఉండవచ్చు. కానీ చీమలు ఇలా ఎందుకు చేస్తాయో మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా?

నిజానికి, మానవుల మాదిరిగానే చీమలు కూడా సామాజిక కీటకాలు. అంటే అవి మానవుల మాదిరిగానే ఇతర చీమలతో కలిసి జీవిస్తాయి. అందువల్ల అవి తరచుగా వేటాడేటప్పుడు కలిసి కనిపిస్తాయి.

చీమలు ప్రతిదీ ఒక నిర్దిష్ట క్రమంలో చేస్తాయి. అవి కలిసి ఆహారం కోసం వెతుకుతాయి. తమ భూభాగాన్ని కాపాడుకుంటాయి. ఇదే మాదిరి ఒక చీమ చనిపోయినప్పుడు ఇతర చీమలు దాని చుట్టూ చేరి, దాని డెడ్ బాడీని అన్ని చీమలు కలిసి ఎత్తుకుపోతాయి. చీమలు ఇలా ఎందుకు చేస్తాయి? తోటి చీమ చనిపోతే వాటికి ఎలా తెలుస్తుంది?

చీమలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి రసాయన సంకేతాలను ఉపయోగిస్తాయి. ఈ రసాయనాన్ని ఫెరోమోన్ అంటారు. చీమ సజీవంగా ఉన్నప్పుడు అది నిరంతరం ఫెరోమోన్ రసాయనాలను విడుదల చేస్తుంది. అదే చీమ చనిపోయినప్పుడు దాని శరీరం ఒలీక్ ఆమ్లం అనే రసాయన సంకేతాన్ని విడుదల చేస్తుంది. ఇది ఇతర చీమలకు ఆ చీమ చనిపోయిందని సంకేతం ఇస్తుంది. దీంతో ఇతర చీమలు దాని చుట్టూ చేరి తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చనిపోయిన చీమను ఆ ప్రాంతం నుంచి తొలగిస్తాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమండీ..!