
రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకునే అలవాటు దాదాపు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇది రోజులో మొదటి భోజనం కాబట్టి వీలైనంత వరకు పోషకాహారం తీసుకోవడానికి ప్రాధన్యత ఇస్తారు. అయితే బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ కూడా తీసుకోవడం చాలా మందికి అలవాటు. నేటి వేగవంతమైన జీవితంలో అధిక మంది బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.

బ్రెడ్ లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉన్నాయి. అయితే ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే ఏమి జరుగుతుందో, ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటుందో చాలా మంది ఆలోచించరు. బ్రెడ్.. ముఖ్యంగా వైట్ బ్రెడ్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. బ్రెడ్ తినడం వల్ల జీవక్రియ ప్రక్రియ మందగిస్తుంది. దీనివల్ల మీ ప్రేగులలో ఆహారం పేరుకుపోతుంది. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

తెల్ల బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అధిక గ్లైసెమిక్ సూచిక త్వరగా ఆకలి వేసేలా చేస్తుంది. ఇది మరింత తినాలనే కోరికను కలిగిస్తుంది. ఇది మీ బరువును ప్రభావితం చేస్తుంది. తెల్ల బ్రెడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

బ్రెడ్‌కి బదులుగా అల్పాహారంగా ఓట్స్, గుడ్లు, పండ్లు, కూరగాయలు తినవచ్చు. ఇది మీకు ఫైబర్, ప్రోటీన్, పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. కడుపు నిండుగానూ ఉంచుతుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌కి తీసుకునే అల్పాహారాన్ని పోషకమైనదిగా, సులభంగా జీర్ణమయ్యేలా చేసుకోవాలి. ఒక వేళ బ్రెడ్ తినవలసి వస్తే, దానిని తక్కువ పరిమాణంలో, వేరే ఏదైనా తిన్న తర్వాత తినడం మంచిది.