
పదేళ్ల క్రితం కట్టెల పొయ్యిలను ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. కానీ నేటి కాలంలో ప్రతి ఇంట్లో గ్యాస్ స్టైవ్‌లు వచ్చేశాయి. కానీ చాలా మందికి గ్యాస్ స్టవ్ వినియోగం మీద అంతగా అవగాహన లేదు. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ మంట నీలం, పసుపు లేదా నారింజ రంగులో ఉండటం మీరు చాలా సార్లు గమనించి ఉండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే స్టవ్ ఎలా మండుతుందో గమనించడం ద్వారా గ్యాస్ ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

గ్యాస్ స్టవ్ మంట నీలం రంగులో ఉంటే గ్యాస్ పూర్తిగా మండుతున్నదని అర్థం. ఇది వంట సామర్థ్యాన్ని పెంచే మంట. నీలిరంగు మంట ఆహారం వేగంగా ఉడకడానికి సహాయపడుతుంది. ఇది గ్యాస్ వృధా కాకుండా నివారిస్తుంది. ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలను తగ్గిస్తుంది.

గ్యాస్ స్టవ్ మంట నారింజ లేదా పసుపు రంగులో ఉంటే,.. అది పూర్తిగా మండడం లేదని అర్ధం. మంట నారింజ రంగులో ఉంటే గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. స్టవ్ చుట్టూ మసి పేరుకుపోయి పాత్రలు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రంగు హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదల కావడానికి కారణమవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీరు ఈ విధంగా రంగులో మార్పును గమనించినట్లయితే బర్నర్‌లో గాలి సరఫరా సరిగా లేదని, దుమ్ము పేరుకుపోయిందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందుగా బర్నర్ శుభ్రం చేసి, గ్యాస్ కనెక్షన్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. అలాగే మీరు గ్యాస్ స్టవ్ ఆన్ చేసినప్పుడు గ్యాస్ వాసన వస్తే జాగ్రత్తగా ఉండాలి.

ఈ జాగ్రత్తలు వెంటనే తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాబట్టి వెంటనే గ్యాస్ ఆపివేసి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ లైట్లు, స్విచ్‌లు వేయవద్దు. గ్యాస్ లీకేజీలను తనిఖీ చేసి వెంటనే ప్రొఫెషనల్‌ని సంప్రదించడం మంచిది.