
కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించిన సృష్టించిన భీభత్సంలో హృదయాన్ని కదిలించే కథలు ఎన్నో.. వాటిల్లో ఒకటి ఏనుగుల గుంపు ఒక మహిళ, ఆమె కుటుంబాన్ని రక్షించడంలో ఊహించని పాత్ర పోషించింది. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలాది మంది తప్పిపోయారు. అయితే భూమి మీద మెతుకు తినే అదృష్టం ఉంటే.. మృత్యువు కూడా దరి చేరదు అన్న కర్మ సిద్ధతాన్ని బాధితురాలు సుజాత విషయంలో నమ్మలిందే. సుజాత అనినచిరా, ఆమె కుటుంబం మృత్యుముఖం నుంచి త్రుటిలో తప్పించుకుంది. తన అనుభవాలను సుజాత మీడియాలో పంచుకుంది. వివరాల్లోకి వెళ్తే..

వరద నీరు ఉప్పొంగడంతో సుజాత ఇంటి పక్కనే ఉన్న రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతో.. సుజాత, ఆమె కుటుంబం తమ ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే పరిస్థితిని అంచనా వేసిన సుజాత సహాయం కోసం ఏడుస్తున్న తన మనవరాలు మృదులని శిధిలాల కింద నుంచి రక్షించుకుంది. "మనవరాలి చిటికెన వేలు ఆధారంగా కష్టపడి ఆమెను శిథిలాల నుంచి బయటకు తీసింది. అంతేకాదు తనకు కనిపించిన బట్టలను తీసుకుని మనవరాలిని వాటితో చుట్టేసింది. వరద నీటిలో ఈత కొట్టడం ప్రారంభించింది.

అలా మనవరాలిని తీసుకుని సురక్షితంగా సమీపంలోని కొండపైకి సురక్షితంగా చేరుకున్నట్లు సుజాత తెలిపింది. అయితే అక్కడ సుజాతకు ఒక అడవి ఏనుగు,రెండు ఆడ ఏనుగులు కేవలం అంగుళాల దూరంలో నిలబడి ఉన్నాయి. ఏనుగులను చూసిన సుజాత భయపడింది. ఉద్వేగానికి లోనైన సుజాత ఏనుగులను కరుణించమని వేడుకుంది.

అప్పుడు చాలా చీకటిగా ఉంది. మనవరాలితో ఉన్న తనకు అర మీటరు దూరంలో ఒక అడవి ఏనుగు నిలబడి ఉంది. అప్పుడు భయం వేసింది అని సుజాత చెప్పింది. అప్పుడు తను ఏనుగుని తమని ఏమీ చేయవద్దు అంటూ అభ్యర్దిన్చినట్లు తెలిపింది. మేము ఇప్పుడే ఒక విపత్తు నుంచి బయటపడ్డాము. మమ్మల్ని ఏమీ చేయవద్దు.. రాత్రికి ఇక్కడే నిద్రపోనివ్వండి.. మమ్మల్ని రక్షించనివ్వమని కోరినట్లు సుజాత తన అనుభవాన్ని పంచుకున్నారు.

అప్పుడే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందని సుజాత చెబుతూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. అర్ధ రాత్రి.. భయంకరమైన పరిస్థితుల్లో ఏనుగులు ఓదార్పు అనుభూతిని అందిస్తూ మా దగ్గరగా వచ్చి నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. సహాయం కోసం ఎదురు చూస్తున్న మాకు ఏనుగు ముఖంలో కన్నీళ్లు కనిపించాయి.. ఆ కన్నీటిని తాను గుర్తించినట్లు సుజాత తెలిపింది.

తాను తన మనవరాలు సురక్షితంగా ఏనుగు కాళ్ళకు చాలా దగ్గరగా ఉన్నాము. ఆ ఏనుగులు మా దుస్థితిని అర్థం చేసుకున్నట్లు అనిపించింది. మేము ఉదయం 6 గంటల వరకు అక్కడే ఉండిపోయాము. ఉదయం కొంతమంది దయగల వ్యక్తులు మమ్మల్ని రక్షించే వరకు ఏనుగులు మాతో ఉన్నాయి అని సుజాత తన అనుభవాణ్ని పంచుకున్నారు. ఆ బాధాకరమైన సమయంలో ఏనుగులు ఇచ్చిన ఓడర్పుని.. వాటితో ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని గుర్తు చేసుకున్నారు సుజాత.