
కావలసిన పదార్థాలు: 80 గ్రాములు - శుభ్రంగా కడిగి తడి ఆరిన తాజా వామాకులు, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు, 1 టీస్పూన్ మినప్పప్పు ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, మీ కారానికి తగినట్లుగ ఎండుమిరపకాయలు, పెద్ద ఉసిరికాయ సైజు చింతపండు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 చిన్న చెంచాల వంట నూనె

తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి చిన్న మంటపై చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ చేసి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో ఒక చెంచా నూనె వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేయించాలి. ఇవి సగం వేగాక ధనియాలు, జీలకర్ర వేసి పోపు దినుసులు ఎర్రగా మారే వరకు వేయించి విడిగా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని చుక్కల నూనెలో ఎండుమిర్చి ముక్కలు, పెద్ద ఉసిరికాయ సైజు చింతపండును విడదీసి వేసి లో ఫ్లేమ్‌పై దోరగా వేయించి పప్పుల ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

పాన్‌లో కొద్దిగా నూనె వేసి, కడిగి ఆరబెట్టిన 80 గ్రాముల వామాకులు, చిటికెడు పసుపు వేయాలి. వామాకులు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. పాన్ వేడికే ఆకు కేవలం ఒక్క నిమిషంలోనే మెత్తబడి మగ్గిపోతుంది ఎక్కువ సేపు వేయిస్తే చేదు వస్తుంది. దీనిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో ముందుగా వేయించిన నువ్వులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన పప్పులు, ఎండుమిర్చి, చింతపండు, సరిపడా ఉప్పు వేసి రవ్వలా బరకగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు మరియు మగ్గించిన వామాకును వేయాలి. వామాకులోని సహజ తేమ సరిపోతుంది కాబట్టి చుక్క నీరు కూడా పోయకుండా పల్స్ చేస్తూ గట్టిగా రోటి పచ్చడిలా గ్రైండ్ చేసుకోవాలి.

రుబ్బిన పచ్చడిని బౌల్‌లోకి తీసుకుని, పెద్ద ముక్కలుగా తరిగిన పచ్చి ఉల్లిపాయలను వేసి చేత్తో లేదా గరిటెతో బాగా కలపాలి. ఉల్లిపాయలు పంటికి తగులుతుంటే పచ్చడి అదిరిపోతుంది. అంతే, ఔషధ గుణాల గని అయిన కమ్మటి వామాకు రోటి పచ్చడి సిద్ధం. దీనికి ఎలాంటి పోపు కూడా అవసరం లేదు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలుపుకుని తింటే కడుపు హాయిగా ఉండటమే కాకుండా అద్భుతమైన రుచినిస్తుంది