
ఆరోగ్యంగా ఉండటానికి, పోషకమైన ఆహారాన్ని తినడం మాత్రమే సరిపోదు. వాటిని సరైన పరిమాణంలో తీసుకోవడం ఎంతో ముఖ్యం. డ్రై ఫ్రూట్స్‌కు కూడా ఇది వర్తిస్తుంది. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల కొన్ని సార్లు బరువు పెరగవచ్చు.. అలాగే తక్కువగా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. కాబట్టి సరైన పరిమాణంలో తీసుకోవడం ముఖ్యం

బాదం: బాదం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ 4 నుండి 7 బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి, బరువును నియంత్రనలో ఉంచుతాయి. నానబెట్టిన బాదంపప్పుల చర్మం సులభంగా ఒలిచిపోతుంది, దీని వలన శరీరం వాటి పోషకాలన్నింటినీ పూర్తిగా గ్రహిస్తుంది.

వాల్నట్: వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 3-4 వాల్‌నట్‌లను రాత్రిపూట నానబెట్టి ఉదయం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తపోటు, మధుమేహం, బరువును నియంత్రించవచ్చు.

ఎండుద్రాక్ష : ఎండుద్రాక్ష అంటే వీటిని ఎండలో లేదా డీహైడ్రేటర్‌లో ఎండబెట్టవచ్చు. వాటిని పచ్చిగా కూడా తినవచ్చు లేదా నీటిలో నానబెట్టి పాలు, పెరుగు, సలాడ్‌లు లేదా గ్రానోలాలో కలిపి తీసుకోవచ్చు. ఎండుద్రాక్షలో ఫైబర్, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ 40–60 గ్రాముల ఎండుద్రాక్ష తినడం వల్ల శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.అలాగే మీ జుట్టు, ముఖానికి సహజమైన మెరుపును జోడిస్తుంది.

పిస్తాపప్పు : పిస్తాపప్పులు రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడే అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి . మీరు రోజుకు 25–30 పిస్తాపప్పులను స్నాక్‌గా తినవచ్చు.

జీడిపప్పు: జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని పచ్చిగా లేదా తేలికగా వేయించి తినవచ్చు అలాగే పండ్ల సలాడ్‌లు, డెజర్ట్‌లు లేదా వివిధ రకాల వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు. జీడిపప్పులు మంచి శక్తికి మూలం, ఇవి ఎముకలు, మెదడు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజుకు 12 నుండి 15 జీడిపప్పులు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.